బతికుండగానే మరణదిన వేడుక ఆహ్వానం... మాజీ మంత్రి ఇన్విటేషన్ వైరల్
రాలలో మాజీ మంత్రి పాలేటి రామారావు సంచలనాలకు తెరతీశారు. తన 12వ మరణ దిన వేడుక ఆహ్వాన పత్రికను విడుదల చేశారు.
ప్రకాశం జిల్లా చీరాలలో మాజీ మంత్రి పాలేటి రామారావు సంచలనాలకు తెరతీశారు. తన 12వ మరణ దిన వేడుక ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారింది. పాలేటి రామారావు చీరాలలో ప్రముఖ రాజకీయ నేత. చిన్న వయసులోనే ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చిన పాలేటి గత కొంత కాలంగా రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు. 35 ఏళ్ల వయసులోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 1994లో ఆయన తొలిసారి రాజకీయ అరంగేట్రం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యను ఓడించారు.
చిన్న వయసులోనే...
ఎన్టీఆర్ మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు. చీరాలలో పాలేటి రామారావుది ప్రత్యేక స్థానమనే చెప్పాలి. తనకంటూ ప్రత్యేక వర్గాన్ని రూపొందించుకున్న పాలేటి ఈ పార్టీలో ఉన్నా ఆ వర్గం మద్దతు దక్కేలా చూసుకుంటారు. మృదుస్వభావి. ఆవేశం అనేది ఆయనలో కన్పించదు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పాలేటి రామారావు మంత్రిగా కూడా పనిచేయడంతో ఇప్పటికీ చీరాల ప్రజలతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు.
వైరల్ అయిన ఆహ్వానం...
చీరాలలో తనకంటూ ప్రత్యేకంగా ఓటు బ్యాంకును ఏర్పరచుకున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కరణం బలరాం గెలుపుకోసం పాలేటి రామారావు చేసిన కృషి అంతా ఇంతా కాదు. అయితే ఆయన నిన్న రాత్రి ఒక ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. ఇది చీరాలలో చర్చకు దారితీసింది. ఇది తన 12వ మరణ దిన వేడుక అని ఆయన చెప్పారు. ఐఎంఏ హాలులో జరిగే ఈ కార్యక్రమానికి అందరూ రావాలని కోరారు. దీంతో పాలేటి రామారావు అభిమానులకు, ఆయన వర్గంలో టెన్షన్ బయలుదేరింది. ఏమయిందో అని ఆయనకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఫోన్లు వస్తున్నాయి.
పెద్దసంఖ్యలో అభిమానులు...
మానవుడు తన మరణస్థితిని ఊహలోకి రానివ్వలేకపోతున్నాడని, అందువల్లనే అనేక తప్పులు చేస్తున్నాడని ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. తాను ఖచ్చితంగా మరణిస్తానని గ్రహించి ఎంతకాలం జీవిస్తాడో లెక్క వేస్తే జీవించే కొద్దికాలంలో ఎలాంటి తప్పులు చేయకుండా మనిషిగా మంచితనంతో, మానవత్వంతో బతుకుతాడని పేర్కొన్నారు. ఈ సిద్ధాంతాన్ని తాను తొలి ప్రయత్నంగా అమలు చేయబోతున్నట్లు ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. శనివారం జరిగేది తన 12వ మరణదిన వేడుకలు అని ఆయన ప్రకటించడంతో పెద్ద సంఖ్యలో పాలేటి రామారావు ఇంటికి ఆయన అభిమానులు చేరుకుంటున్నారు.