తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఏమయ్యారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రానికి చెందిన వారు సీబీఐ ఉన్నతాధికారులకు ముడుపులు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐటీ దాడులు జరుగుతుంటే చంద్రబాబు నాయుడు ఎందుకు ఉలికిపడుతున్నారని ప్రశ్నించారు. వై.ఎస్. జగన్ పై హత్యాయత్నం జరిగితే, ఏమీ లేదని చంద్రబాబు ముందుగానే ఎలా నిర్ధారిస్తారని అన్నారు. చంద్రబాబు ప్రెస్ మీట్ లో చెప్పిన దానికి, విచారణ అధికారి నివేదికకు పొంతన లేదని పేర్కొన్నారు. సీఎం చెప్పిన కథకు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎవరో తేలాలని, దీనిపై న్యాయ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. హత్యాయత్నం ఘటనపై నిబద్దతతో విచారణ జరగాలని, కేంద్రంపై నేపం నెట్టేలా చంద్రబాబు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తుందని ఆరోపించారు. కేంద్రం ఏ విచారణ అయినా చేసుకోవచ్చని చంద్రబాబు ముందు అన్నారని, ఇప్పుడు కేంద్ర విచారణ కోసం వైసీపీ ఢిల్లీకి వెళ్లగానే ఇప్పుడు మాట మార్చారని పేర్కొన్నారు. కేంద్ర ధర్యాప్తు అనగానే చంద్రబాబు వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు.