పోలింగ్ శాతాన్ని బట్టే ఫలితమా?

మునుగోడు ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎక్కువయితే మంచిదన్న ధోరణిలో టీఆర్ఎస్ ముందు నుంచే వ్యూహాలను రచిస్తూ వెళ్లింది.

Update: 2022-10-31 06:46 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిస్తేనే ఆయనకు దేశంలో ఇతర పార్టీల నుంచి కొంత మద్దతు లభిస్తుంది. ఇంట గెలచి.. రచ్చ గెలువు అన్న సామెత ఇక్కడ కూడా వర్తిస్తుంది. అందుకే మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేందుకు సర్వశక్తులను టీఆర్ఎస్ ఒడ్డుతుంది. ఏ మాత్రం తేడా కొట్టినా జాతీయ స్థాయిలో కేసీఆర్ కు అవమానం తప్పదు. అది గుర్తుంచుకుని టీఆర్ఎస్ నేతలు ఈ ఎన్నికల్లో చెమటోడుస్తున్నారు. తమకు అప్పగించిన బాధ్యతలను తు.చ తప్పకుండా పూర్తి చేస్తున్నారు.

బీసీలు ఎక్కువగా...
మునుగోడులో బీసీ ఓటర్లు ఎక్కువ. ఆ సామాజికవర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి అన్ని రకాలుగా టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంది. మునుగోడులో మొత్తం 2.20 లక్షల మంది ఓటర్లున్నారు. ఇందులో అత్యధికంగా గౌడ సామాజికవర్గానికి చెందిన వారు 35 వేలకు పైగా ఉన్నారు. తర్వాత ముదిరాజ్ లు 34 వేల మంది వరకూ ఉన్నారు. పద్మశాలీలు 12 వేల మంది, యాదవులు 22 వేల మంది వరకూ ఓటర్లు ఉండటంతో వారితో ప్రత్యేకంగా హైదరాబాద్ లో సమావేశాలు ఏర్పాటు చేశారు. కుల సమావేశాలను ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ వారికి హామీలు ఇవ్వడంతో పాటు మునుగోడులో గెలిపిస్తే తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చింది.
కాంగ్రెస్ బలం పెరగడంతో...
బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఆర్ధికంగా, సామాజికపరంగా బలమైన వ్యక్తి కావడంతో ప్రతి ఓటును సీరియస్ గా తీసుకుంది. ప్రతి ఓటును పోల్ చేసే బాధ్యతను కార్యకర్తలకు అప్పగించింది. ప్రతి యాభై ఓటర్లకు ఒక కార్యకర్తను నియమించింది. అతనే దగ్గరుండి వారి చేత ఓటు వేయించాల్సి ఉంటుంది. పోలింగ్ శాతం తగ్గకుండా చూసుకోవాలన్నది టీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తుంది. పోలింగ్ శాతం ఎంత ఎక్కువయితే అంత మంచిదన్న ధోరణిలో టీఆర్ఎస్ ముందు నుంచే వ్యూహాలను రచిస్తూ వెళ్లింది. ఆ యా సామాజికవర్గాల నేతలకు ఓట్లు పోలయ్యే బాధ్యతను అప్పగించింది.
బీజేపీనే టార్గెట్...
అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకోవడం కూడా తమకు మంచిదేనని భావిస్తుంది. కాంగ్రెస్ ఎంత ఎక్కువగా ఓట్లను చీల్చుకుంటే అంత మనం సేఫ్ జోన్ లో ఉంటామని టీఆర్ఎస్ నేతలు విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి పడే ఓట్లు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందినవేనని, అందుకే కాంగ్రెస్ బలం పెరగడం తమ గెలుపును మరింత సునాయాసం చేశాయంటున్నారు టీఆర్ఎస్ నేతలు. అందుకే కాంగ్రెస్ పై పెద్దగా విమర్శలు చేయకుండా బీజేపీయే తమ ప్రధాన శత్రువు అన్నట్లు వ్యవహరించిందంటున్నారు. మొత్తం మీద పోలింగ్ శాతాన్ని బట్టి గెలుపోటములు ఆధారాపడి ఉంటాయని రాజకీయ విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. ఇది తెలియాలంటే మరి కొద్ది గంటలు ఆగాల్సిందే.
Tags:    

Similar News