ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడుగా
రిటైర్మెంట్ వయసు పెంచుతూ ఉద్యోగుల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నం జగన్ చేసినట్లే కనపడుతుంది.
అందుకే అన్నారు.. మనస్తత్వం తెలుసుకుని మనగలిగితే విజయం సాధించగలుగుతారు. ఏపీ ప్రభుత్వోద్యోగుల విషయంలో కూడా అదే జరిగింది. జగన్ ఎక్కడ దెబ్బకొట్టాలో అక్కడే కొట్టారు. రిటైర్మెంట్ వయసు పెంచుతూ వారిలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నం చేసినట్లే కనపడుతుంది. 60 ఏళ్ల నుంచి 62 ఏళ్ల వయసుకు జగన్ ప్రభుత్వం పెంచడంతో ఉద్యోగుల్లో కొంత మేరకు ఆనందం కనపడింది.
రిటైర్మెంట్ వయసును....
ఉద్యోగ సంఘాల నాయకుడు బండి శ్రీనివాసరావు వచ్చే నెలలో రిటైర్ కావాల్సి ఉంది. ఈ విషయాన్ని ప్రకటించిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ కు ఆయన కృతజ్ఞతలు తెలపడం విశేషం. ఉద్యోగులు ఎక్కువగా త్వరగా రిటైర్మెంట్ కావాలని కోరుకోరు. ఇప్పుడు 60 ఏళ్లలోనూ షుషారుగా పనులు చేసుకోగలుగుతున్నారు. మరో రెండేళ్లు ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగించడమంటే వారికి సంతోషం తప్ప మరొకటి కలగదు.
ఆందోళన ఇక లేనట్లే...
జీతంతో పాటు ఈ రెండేళ్లు అన్ని రకాల బెనిఫిట్ లను పొందే అవకాశం ఉంటుంది. అందుకే జగన్ ఉద్యోగులపై రిటైర్మెంట్ అస్త్రాన్ని ప్రయోగించారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. దీంతో పాటు ఉద్యోగ సంఘాల 27శాతం ఫిట్ మెంట్ ను కోరుకున్నాయి. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం 23.29 శాతం ఫిట్ మెంట్ ప్రకటించారు. ఉద్యోగ సంఘాలు కోరుకున్న దానికంటే నాలుగు శాతం అదనంగా ఇచ్చారు. అంతకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఇవ్వలేదని కూడా ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. మొత్తం మీద జగన్ ఉద్యోగుల నుంచి తన హయాంలో ఎలాంటి సమ్మె జరగకుండా నివారించగలిగారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం నిర్ణయం పట్ల పూర్తి స్థాయి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.