ఐడియా అదుర్స్.. కానీ అవుతుందా?

షరతులు పెట్టి ముఖ్యమంత్రి పదవిని సాధించలేమని జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ అన్నారు;

Update: 2023-05-11 12:50 GMT

షరతులు పెట్టి ముఖ్యమంత్రి పదవిని సాధించలేమని జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ అన్నారు. బలాన్ని బట్టి సీట్లు అడుగుతామని చెప్పారు. జనసేనకు పట్టున్న ప్రాంతంలో ఖచ్చితంగా పోటీ చేస్తామని తెలిపారు. తన సత్తా ఏంటో చూపించి అప్పుడు ముఖ్యమంత్రి పదవి అడుగుతానని, అంతే తప్ప ముందుగా తనకు ముఖ్యమంత్రి పదవి కావాలని చెప్పి పొత్తులు కుదుర్చుకునే ప్రసక్తి లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆయన జనసేన నేతలతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి పదవి...
పొత్తులపై విముఖలతో ఉన్న పార్టీలను ఖచ్చితంగా ఒప్పిస్తామని తెలిపారు. తనను ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీని కాని, టీడీపీని కాని అడగబోనని పవన్ కల్యాణ్ తెలిపారు. ముందస్తు ఎన్నికలు అంటున్నారు కాబట్టి జూన్ 3వ తేదీ నుంచి ఇక్కడే ఉంటానని, ప్రజాసమస్యలపై పోరాడతానని పవన్ తెలిపాు. ముఖ్యమంత్రి పదవి వరించి రావాలి కాని, మనం కోరుకుంటే అది వచ్చేది కాదని పవన్ కల్యాణ‌్ అభిప్రాయపడ్డారు.
మూడు పార్టీలు కలిసి...
అంటే వైసీపీని ఓడించేందుకు పవన్ అన్ కండిషనల్‌గా పొత్తులు పెట్టుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తనకు బలం ఉన్న స్థానాల్లో మాత్రం ఖచ్చితంగా పోటీ చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు కనపడుతుంది. పొత్తులకు ముఖ్యమంత్రి పదవి అభ్యర్థి ప్రామాణికం కాదని పవన్ అన్నట్లు చెబుతున్నారు. బీజేపీతో కలుపుకుని టీడీపీతో కలసి వెళ్లాలన్న ప్రయత్నంలోనే పవన్ కల్యాణ్ ఉన్నారు. కనీసం ముప్పయి స్థానాల్లో గెలిచేలా ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు.
కర్ణాటక తరహాలో...
అప్పుడు కర్ణాటక తరహాలో తననే పిలిచి మరీ ముఖ్యమంత్రి పదవి ఇస్తారన్న నమ్మకంతో పవన్ కల్యాణ్ ఉన్నట్లు కనపడుతుంది. అందరూ అనుకున్నట్లుగా, హరిరామజోగయ్య లాంటి వాళ్లు చెబుతున్నట్లుగా ముఖ్యమంత్రి పదవి తనకు ముఖ్యం కాదని, పొత్తులు కుదరడానికి ముఖ్యమంత్రి పదవి అడ్డం కాదని పవన్ స్పష్టం చేశారు. అంటే కింగ్ మేకర్‌గా కావాలన్నదే పవన్ ఉద్దేశ్యంగా కనిపిస్తుంది. ఆలోచన బాగుంది.. కానీ అది గ్రౌండ్ అవుతుందా? లేదా? అన్న అనుమానాలే జనసైనికులను వేధిస్తున్నాయి.


Tags:    

Similar News