గెలిస్తే ఓకే... లేకుంటే?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీలతో పొత్తుకు దిగడం చర్చనీయాంశమైంది
ఏదైనా గుప్పెట మూసి ఉంచేంత వరకే రహస్యం. అది ఓపెన్ అయిన తర్వాత ఇక దాచిపెట్టేదేమీ ఉండదు. తేలిపోతే తేలిపోవచ్చు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిసి ఊబిలోకి దిగుతున్నారా? లేకపోతే తెలియకుండానే తన అడుగులు పార్టీకి భవిష్యత్ లేకుండా చేస్తున్నాయా? అన్నది జనసైనికులకు కూడా అర్థం కాకుండా ఉంది. మూడు పార్టీలతో కలిపి 2024 ఎన్నికలకు వెళ్లి అనుకోని పరిస్థితుల్లో వైసీపీ చేతిలో ఓటమి పాలయితే ఇక జనసేన కోలుకోనట్లే. అప్పుడు జనం జనసేనను నమ్మరు. మిగిలిన రాజకీయ పార్టీలు కూడా జనసేనను చేరదీయడానికి ఎవరూ సిద్ధపడరు.
2014 రిపీట్ అయితే....
2014లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీ కూటమికి బహిరంగంగా మద్దతు ఇచ్చింది. ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోయినా వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని భావించి నాడు పవన్ కల్యాణ్ టీడీపీ కూటమికి మద్దతిచ్చారు. ఆ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించింది. అయితే ఆ ఎన్నికల్లో తాను మద్దతు ఇవ్వడం వల్లనే కూటమి విజయం సాధ్యమయిందని పవన్ నమ్ముతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఒకింత అదే రకమైన అభిప్రాయంతో ఉన్నారు. ఎందుకంటే పవన్ వెనక ఫ్యాన్స్ తో పాటు బలమైన కాపు సామాజికవర్గం ఉంది. అందుకే పవన్ కు రాజకీయాల్లో అంత డిమాండ్ ఉందని చెప్పాలి.
అందుకే పొత్తు...
అందుకే పవన్ ను వదులుకునేందుకు చంద్రబాబు సిద్ధపడటం లేదు. పవన్ కోరితే కొన్ని స్థానాలు అధికంగా ఇచ్చైనా సరే పొత్తుకు సిద్ధమవుతారు. అంతేకాకుండా బీజేపీని కూడా ఈ కూటమిలో తెచ్చేందుకు పవన్ ఉపయోగపడతారు. 2019 ఎన్నికలు జరిగిన వెంటనే బేషరతుగా బీజేపీతో జట్టుకట్టినప్పుడే పవన్ ఈ పనికోసమే వెళ్లారని వైసీపీ నేతలు ఆరోపణల్లో నిజానిజాలు ఎలా ఉన్నా పవన్ ఇప్పుడు చెబుతున్న దాని ప్రకారం అది నిజమేనని పిస్తుంది. లేకుంటే ఎన్నికలు జరిగిన రెండు మూడు మాసాల్లోనే పొత్తుకు వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని తమ కూటమిలోకి తెచ్చుకునేందుకే పవన్ వెళ్లారన్నది కూడా అంతే కాదనలేని వాస్తవం. కానీ ఈసారి కూడా ఆ కూటమి గెలిస్తే ఓకే. పవన్ చరిష్మా కొంత కాలం నిలబడుతుంది. పవన్ వల్లనే గెలిచారని జనం నుంచి రాజకీయ పార్టీ నేతల వరకూ అందరూ భావిస్తారు.
ఓటమి పాలయితే...
2014లో లాగా వైసీపీ లేదు. అప్పటికీ ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంది. పరిపాలన చేసింది. సంక్షేమం ద్వారా ప్రత్యేక మైన ఓటు బ్యాంకు సంపాదించుకుంది. మంచి జరిగితేనే తనకు ఓటు వేయమని ఇప్పటికే జగన్ కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో కానీ అనుకోని పరిస్థితుల్లో కూటమి ఓటమి పాలయితే మాత్రం పవన్ రాజకీయ పార్టీకి ఇక శాశ్వతంగా చిరునామా కూడా దొరకదన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఓటమి పాలయితే పవన్ ఎవరు లెక్క చేస్తారు? ఆయనను ఇటు బీజేపీతో పాటు ఇక భవిష్యత్ తో టీడీపీ కాని, కమ్యునిస్టులు కాని నమ్మరు. అందుకే పవన్ ఆచితూచి అడుగులు వేయాల్సిన సమయంలో ఆవేశంతో వెళుతున్నారన్న కామెంట్స్ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. అయితే దాని వల్ల పవన్ కు వ్యక్తిగతంగా వచ్చే నష్టమేమీ లేదు. రాజకీయంగా ఇబ్బంది ఎదురైనా ఆయనకు వేరే వృత్తి ఉంది కాబట్టి ఇబ్బందులు తలెత్తక పోవచ్చు. కానీ ఆయనను నమ్ముకుని పార్టీలో ఉన్న జనసేన నేతలు మాత్రం తీవ్ర స్థాయిలో నష్టపోతారన్న హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి.