చివరకు ఆయనే ఆధారమా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు రాజకీయ వ్యూహాలు కొరవడ్డాయనే చెప్పాలి.

Update: 2022-04-07 04:30 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు రాజకీయ వ్యూహాలు కొరవడ్డాయనే చెప్పాలి. ఆయనను కొందరు కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నట్లు జనసేన పార్టీలో చర్చ జరుగుతుంది. పవన్ తర్వాత స్థానంలో ఉన్న సదరు నేత ఇచ్చే రాంగ్ డైరెక్షన్ లో పవన్ పయనిస్తున్నారని, అది భవిష్యత్ లో పార్టీకి నష్టాన్ని చేకూరుస్తుందని జనసేన సీనియర్ నేతలు సయితం అభిప్రాయపడుతున్నారు. నిజానికి జనసేన ఆవిర్భావ సభలో చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. వైసీపీకి వ్యతిరేకంగా అందరినీ ఏకం చేస్తానని చెప్పడమూ బాగానే ఉంది. అదే సమయంలో రోడ్డు మ్యాప్ అంశం పార్టీని ఇరకాటంలోకి నెట్టిందంటున్నారు.

రోడ్డు మ్యాప్....
నిజానికి బీజేపీపై పవన్ కల్యాణ్ ఇప్పటికీ ఆధారపడి ఉన్నారన్న సంకేతాలను ఇటు క్యాడర్ కే కాక ప్రజల్లోకి కూడా వెళ్లిపోయింది. ఇది పవన్ ఇమేజ్ ను ఖచ్చితంగా డ్యామేజీ చేసిందంటున్నారు. ఏపీలో ముఖ్యమంత్రి కావాల్సిన పవన్ కల్యాణ్ ఇక్కడ ఏమీ లేని పార్టీ చేతిలో పావుగా మారారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. భవిష్యత్ లో పవన్ బీజేపీ మిత్రత్వం నుంచి బయటకు వచ్చినా పవన్ కు పెద్దగా ప్లస్ అయ్యేదేమీ లేదంటున్నారు.
సిద్ధంగా ఉన్నా....
మరోవైపు పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు విషయాన్ని ఇప్పటి నుంచే ప్రస్తావించడం పార్టీకి భారీ స్థాయిలో నస్టం చేకూరుస్తుందంటున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉంది.టీడీపీ నాయకత్వంపై నమ్మకం లేక అనేక మంది నేతలు ఇతర పార్టీల వైపు చూసే సమయం ఇది. అంటే జనసేనలో చేరికలు ఎక్కువగా ఉండే అవకాశముంది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీ నుంచి ఎక్కువగా వలసలు ఉంటాయని అక్కడి జనసేన నేతలు అంచనా వేశారు.
చేరికలు ఆపేసుకున్నారా?
కానీ పవన్ టీడీపీతో పొత్తు ఉంటుందన్న సంకేతాలు బలంగా ఇస్తుండటంతో చేరికలు పూర్తిగా నిలిచిపోయాయి. జనసేన కోటా కింద వెళ్లే సీట్లలో తప్ప ఇంకెక్కడా హడావిడి కనిపించడం లేదు. పవన్ తనంతట తానుగానే చేరికలకు ఫుల్ స్టాప్ పెట్టేసుకున్నారన్న వ్యాఖ్యలు పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం పార్టీలో సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కారణమంటున్నారు. ఆయన పవన్ కు తప్పుడు సలహాలు ఇవ్వడం వల్లనే ఇప్పటికే అనేక మంది నేతలు పార్టీని విడిచివెళ్లిన విషయాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు.


Tags:    

Similar News