కమ్మ కులంలో కదలిక వచ్చిందా?

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు అన్యాయం జరుగుతుందని కమ్మ సామాజికవర్గం భావిస్తుంది.;

Update: 2021-12-02 02:17 GMT

ఆంధ్రప్రదేశ్ లో సామాజికవర్గాల సమస్య ఎన్నికలకు మూడేళ్ల ముందే ప్రారంభమయింది. ప్రధానంగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు అన్యాయం జరుగుతుందని కమ్మ సామాజికవర్గం భావిస్తుంది. కేవలం రాజకీయంగానే కాకుండా, వ్యాపారపరంగా తమను అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని అనుమానిస్తుంది. ఇందుకు అమరావతి రాజధాని తరలింపు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు నిలిపివేయడం వంటివి ఉదాహరణలుగా చూపుతుంది. అయితే 2019 ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గంలో ముప్ఫయి శాతం జగన్ కు అండగా నిలిచారు.

వీరిద్దరే...
జగన్ కూడా కమ్మ సామాజికవర్గం నేతలతోనే సినిమాను నడిపిస్తున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వారితో చంద్రబాబు పై మాటల దాడి చేయిస్తూ ఆయనను మానసికంగా కుంగదీస్తున్నారు. గత రెండున్నరేళ్లుగా ఇది జరుగుతున్నా కమ్మ సామాజికవర్గం ఓపిక పట్టింది. ఇక లాభం లేదనుకుని కొంత దూకుడు పెంచే ప్రయత్నం చేస్తుంది. పవన్ కల్యాణ్ వంటి నేతలు కూడా కమ్మ సామాజికవర్గానికి అండగా నిలుస్తామని చెప్పడంతో కొంత ధైర్యాన్ని తెచ్చుకుని ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయినట్లే కన్పిస్తుంది.
ఈసారి అధికారంలోకి...
ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ తర్వాత ముఖ్యమంత్రి అయింది చంద్రబాబు మాత్రమే. కమ్మ సామాజికవర్గానికి చెందిన వీరిద్దరే సీఎంలుగా పనిచేశారు. మరోవైపు ప్రధాన మీడియా కూడా వారి చేతుల్లోనే ఉంది. ఈసారి టీడీపీ అధికారంలోకి రాలేకపోతే శాశ్వతంగా ముఖ్యమంత్రి పీఠం తమ చేజారుతుందన్న ఆందోళన ఒకవైపు, వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటాయని భయం మరోవైపు వారిని పట్టి పీడిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏపీని ఆనుకుని ఉన్న ఖమ్మం జిల్లాకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్ మల్లాది వాసు చేసిన వ్యాఖ్యలను ఆ కోణంలోనే చూడాల్సి ఉంటుంది.
కమ్మ వ్యతిరేకులుగా....
ప్రధానంగా మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కమ్మ వ్యతిరేకులుగా ముద్ర వేసే ప్రయత్నం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరుగుతుందనే చెప్పాలి. జగన్ తమ సామాజికవర్గానికి మంత్రి వర్గంలోనూ, పదవుల్లోనూ అన్యాయం చేస్తున్నారన్న భావన కల్గిస్తుంది. అందుకే కమ్మ సామాజికవర్గం కార్తీక మాసం వన భోజనాల్లోనూ వల్లభనేని వంశీ, కొడాలి నాని టార్గెట్ అయ్యారు. మొత్తం మీద ఏపీలో కమ్మ సామాజికవర్గం అంతా ఏకతాటిపైకి వచ్చినట్లే కన్పిస్తుంది. టీడీపీకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమయినట్లే కన్పిస్తుంది. అందుకే వల్లభనేని వంశీ బేషరతుగా క్షమాపణ చెప్పాడంటున్నారు.


Tags:    

Similar News