ఎంతైనా తండ్రి మనసు కదా?
కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేస్తున్న మూడు రోజులు కేసీఆర్ కొంత టెన్షన్‌లోనే ఉన్నారంటున్నారు;
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రగతి భవన్‌కే పరిమితమయ్యారు. తన కుమార్తె కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేస్తున్న మూడు రోజులు కేసీఆర్ కొంత టెన్షన్‌లోనే ఉన్నారంటున్నారు. అందుకే ఆయన పార్టీ కార్యక్రమాలను కూడా పూర్తిగా పక్కన పెట్టేశారు. గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలను కూడా పట్టించుకోవడం లేదు. కవిత ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు వెళుతుంటే ఆమె వెంట మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎంపీ సంతోష్ లను కూడా పంపారు. కవితకు ధైర్యం చెప్పాలని, ఇలాంటివి రాజకీయాల్లో సర్వ సాధారణమని, ఆరోపణలను ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే నిలబడగలమని కవితకు ఫోన్ లో కూడా చెప్పిపంపినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఎంతైనా తండ్రి మనసు కదా. మనసులో బాధను ఎంతటి వారైనా దిగమింగుకోలేరు.
ఎవరికీ ఇలాంటి...
నిజానికి కేసీఆర్ కుటుంబంలో ఎవరికీ ఇలాంటి అనుభవాలు లేవు. ఉద్యమ సమయంలో కేసులు, జైళ్లు పాలు కావడం మినహా ఇటువంటి ఘటనలు ఎప్పుడూ చోటు చేసుకోలేదు. కేవలం అవినీతి ఆరోపణలు వచ్చినా అరెస్ట్ వరకూ వెళతారన్న భయమూ ఇంతవరకూ పడలేదు. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు చూసి ఆయన కొంత అసహనానికి లోనయినట్లు చెబుతున్నారు. రాజకీయంగా పార్టీకి లాభమైనప్పటికీ కుటుంబ పరంగా క్షోభను అనుభవించాల్సి వస్తుందన్నది ఆయన ఆలోచన. అందునా ఒక ఆడపిల్ల మీద లిక్కర్ స్కామ్ ముద్ర పడటం కూడా కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారంటున్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇలా బాధపడలేదని సన్నిహితులతో ఆయన వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. కేసీఆర్ ఆదేశంతోనే మంత్రులంతా ఢిల్లీకి పయనమయ్యారని చెబుతున్నారు.
ఎన్నికలను అసలు లెక్కే...
కేసీఆర్ ఎన్నికలను ఎప్పుడూ లెక్క చేయరు. ఆయన వ్యూహాలు కరెక్ట్‌గా అమలవుతాయి. ఎప్పుడు ఏ అస్త్రం ప్రయోగించాలో ఆయనకు కొట్టిన పిండి. రాజకీయాల వ్యూహాలను వేయడంలో ఆయన దిట్ట. బీఆర్ఎస్ ను మూడోసారి కూడా అధికారంలోకి తెచ్చే సత్తా తనకు ఉందని నమ్మకం కలిగిన నేత కేసీఆర్. పొలిటికల్ గేమ్ లో పావులు సులువుగా కదపగలిగిన కేసీఆర్ కవిత ఇష్యూతో కొంత డీలా పడ్డారని సమాచారం. ఎప్పటికప్పుడు ఢిల్లీకి వెళ్లిన నేతలతో కేసీఆర్ ఫోన్ లో సంప్రదింపులు జరుపుతూనే న్యాయ నిపుణులను ఎవరిని కలుసుకోవాలన్నది కూడా సూచిస్తున్నారు. ఆయన నిరంతరం కవిత ఇష్యూను ఫాలో అప్ చేస్తూనే ఉన్నారని చెబుతున్నారు.
ఈ మూడు రోజులు...
అందుకే కవిత ఢిల్లీ వెళ్లిన మూడు రోజుల పాటు పూర్తిగా కార్యక్రమాలను వదిలేసినట్లు చెబుతున్నారు. కొంత అన్యమనస్కంగా ఉన్న కేసీఆర్ ను కలిసేందుకు ఉన్నతాధికారులు సయితం వెనకడగు వేశారంటున్నారు. పంట నష్టం వంటి వివరాలపై కూడా ఆయనకు సమాచారం అందించేందుకు అధికారులు జంకినట్లు తెలిపారు. తన కుమార్తె కవిత ఏ తప్పు చేయలేదని, కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ కేసు నమోదు చేశారని జాతీయ స్థాయి నేతలకు కూడా కేసీఆర్ వివరించినట్లు తెలిసింది. అందుకే తొలిసారి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు బహిరంగ లేఖను విడుదల చేశారంటున్నారు. మొత్తం మీద మూడు రోజుల విచారణ పూర్తికావడంతో కేసీఆర్ కూడా కొంత టెన్షన్ ఫ్రీ అయ్యారు.