నా సత్తా ఏంటో చూపిస్తా.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో రాజకీయాలు ఊపందుకున్నాయి. నిన్న సీఎం కేసీఆర్ బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన విషయం..
తెలంగాణలో రాజకీయాలు ఊపందుకున్నాయి. నిన్న సీఎం కేసీఆర్ బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే అందులో కొందరికి టికెట్ దక్కపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టికెట్ దక్కని వారు తీవ్ర నిరాశలో తమ కార్యచరణను సిద్దం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేఖానాయక్ వచ్చే ఎన్నికల్లో టికెట్ కోల్పోయారు. టికెట్ దక్కకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. మీడియాతో మాట్లాడిన ఆమె.. లాబీయింగ్ చేయకపోవడం వల్లే తనకు టికెట్ దక్కలేదని చెప్పుకొచ్చారు.
ఖానాపూర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి అసలు ఎస్టీనే కాదు.. పార్టీలో లాబీయింగ్ నడుస్తుందని చెప్పారు కానీ.. ఇలా జరుగుతుందని అనుకోలేదని, వాళ్ల లాగా తనకు పది వాహనాలు పెట్టుకుని పైరవీలు చేయలేదని అన్నారు. కన్వెర్డెడ్ క్రిస్టియన్ జాన్సన్‌కి ఎస్టీ కోటాలో సీటు ఎలా ఇస్తారని రేఖానాయక్ ప్రశ్నించారు. ఖానాపూర్‌లో నా సత్తా ఏంటో చూపిస్తానంటూ వ్యాఖ్యలు చేశారు. నా సాయం లేకుండా ఖానాపూర్‌లో ఎవ్వరూ ముందుకెళ్లరని అన్నారు. మంత్రి పదవి డిమాండ్ చేస్తాననే ఉద్దేశంతో నాకు టికెట్ ఇవ్వలేదని అన్నారు. ఏదీ ఏమైనా ఖచ్చితంగా ఖానాపూర్ బరిలో ఉంటానని స్పష్టం చేశారు.
కేటీఆర్ స్నేహితుడనే జాన్సన్‌కు టికెట్ ఇచ్చారని తెలిపారు. ఆనాడు కూడా ఖానాపూర్‌లో ఇతర అభ్యర్థులకు ఢీకొట్టాలంటే రేఖానాయక్‌తోనే అవుతుందని టికెట్ ఇచ్చారని, అటువంటిది ఆ గుర్తింపు కూడా ఇవ్వకుండా ఇప్పుడు టికెట్ వేరే వ్యక్తికి కేటాయించడం బాధగా ఉందన్నారు. తనకు టికెట్ ఇవ్వకుండా ఎస్టీకోటలో క్రిస్టియన్ వ్యక్తికి టికెట్ కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. నా వల్లే ఖానాపూర్‌లో బీఆర్‌ఎస్ బలపడిందన్నారు. తనకు సమయం వచ్చినప్పుడు మాట్లాడుతానని, త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని అన్నారు. ప్రజల్లోనే ఉండి పోటీలో తప్పకుండా ఉంటానని స్పష్టం చేశారు. అయితే పోటీలో ఉండాలంటే పార్టీ మారాల్సిందే కదా అనే ప్రశ్నకు రేఖానాయక్ సమాధానం చెప్పారు. అవును.. ఆ నిర్ణయం కూడా త్వరలోనే తీసుకుంటానని అన్నారు. పోటీలో ఉండటం ఖాయమని, అలాంటప్పుడు ఏ పార్టీలోకి వెళ్లేది అనేది త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటిస్తానని అన్నారు. ప్రజలు నాకు మద్దతుగా ఉన్నారని అన్నారు.