కొండగట్టు లోయలో బస్సు ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య యాభైకి చేరుకుంది. కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న భక్తుల్లో యాభై మంది చనిపోవడం అతిపెద్ద విషాద సంఘటనగా చెప్పుకోవచ్చు. లోయలో ప్రయాణిస్తున్న జగిత్యాల ఆర్టీసీ డిపో బస్సు ఘాట్ రోడ్డులో 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుండగా ప్రమాదం సంభవించింది. ఒక మలుపు వద్ద డ్రైవర్ స్లోచేయకుండానే తిప్పడంతో ప్రయాణికులు డ్రైవర్ మీద పడటంతో బస్సును డ్రైవర్ అదుపు చేయలేకపోయారంటున్నారు. జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో యాభై మృతదేహాలను ఉంచారు. మృతులంతా శనివారం పేట చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన వారుగానే గుర్తించారు. ప్రమాద ఘటనపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియో ప్రకటించింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 80 మంది వరకూ ప్రయాణికులున్నట్లు అంచనా. సీరియస్ గా ఉన్న వారిని హైదరాబాద్ కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మృతుల్లో 32 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. ఆర్టీసీ చరిత్రలో ఇదే అతిపెద్ద ప్రమాదం.