మాండూస్ ఎఫెక్ట్ .. మామూలుగా లేదుగా
మాండూస్ తుపాను దెబ్బకు తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలు చిరుటాకులా వణికిపోయాయి
మాండూస్ తుపాను దెబ్బకు తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలు చిరుటాకులా వణికిపోయాయి. మహాబలిపురం వద్ద తుపాను తీరం దాటడంతో బలమైన ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కురియడంతో విద్యుత్తు స్థంభాల నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తిరుపతిలోని అనేక ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. నిత్యావసర వస్తువులతో పాటు ఖరీదైన వస్తువులు కూడా నీళ్లపాలయ్యాయి.
మునిగిపోయిన ఇళ్లు...
ఇక పంట పొలాలు కూడా పూర్తిగా నీటి మునిగి రైతులు నష్టపోయే పరిస్థితికి వచ్చింది. చేతికొచ్చిన పంట వరి నీటమునగడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రాజెక్టులన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి. అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ స్థంభించి పోయింది. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై కూడా నీరు చేరడంతో వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి.
ప్రభుత్వం వైపు...
పంట నష్టం ఎంత అనేది ఇంకా తెలియకపోయినప్పటికీ కోట్లలోనే చేతికొచ్చిన పంట దెబ్బతినిందని రైతులు చెబుతున్నారు. అధికారులు అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించడంతో కొంత ఇబ్బంది తప్పింది. మొత్తం మీద మాండూస్ తుపాను ఎఫెక్ట్ తో ఏపీలోని పలు జిల్లాల్లో నష్టం జరిగిందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.