నిద్రపట్టడం లేదుగా?

మునుగోడు ఉప ఎన్నికలు సమీపించే కొద్దీ నేతలు పార్టీలు మారడం ఎక్కువయింది. దీంతో పార్టీ అధినేతలకు ఇది తలనొప్పిగా మారింది

Update: 2022-10-16 04:28 GMT

మునుగోడు ఉప ఎన్నికలు సమీపించే కొద్దీ జంప్ లు ఎక్కువయ్యాయి. జనాల మూడ్ ఎలా ఉందో తెలియదు కాని నాయకులకు మాత్రం పండగగానే ఉంది. ఇప్పటి వరకూ పట్టించుకోని పార్టీలు నేతలు జారిపోకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరు ఏ పార్టీకి వెళతారో? ఎప్పుడు జంప్ అవుతారో? తెలియని పరిస్థితి. నిన్న నామినేషన్ లో పాల్గొని పార్టీ జెండా పట్టుకుని తిరిగిన నేతలు తెల్లారేసరికి రంగు జెండా మార్చేస్తున్నారు. వాళ్లకు వచ్చిన ఆఫర్లు కావచ్చు. వాళ్లకు నచ్చిన నాయకులు కావచ్చు. నమ్మకంగా ఉన్నా నేతలు కూడా పార్టీలను వీడి వెళుతుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

మాజీ ఎంపీ జంప్....
మునుగోడు ఉప ఎన్నికల వేళ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో డాక్టర్ల జేఏసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయనకు 2014లోనే టీఆర్ఎస్ ఎంపీగా అవకాశమిచ్చింది. భువనగిరి లోక్ సభ నుంచి గెలిచిన నర్సయ్య గౌడ్ 2019లో జరిగిన ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే ఆయన మరోసారి ఎన్నికల్లో పోట ీచేయడానికి ఇంకా రెండేళ్లు సమయం ఉంది. 2024 ఎన్నికల్లో ఆయనకు మళ్లీ అవకాశం లభించ వచ్చు. కానీ ఈలోపు ఏడాదిన్నర పాటు ఉండే మునుగోడు టిక్కెట్ ను ఆశించారు. అది కాదనడంతో ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయారు.
నేతలను ఆకట్టుకోవడానికి....
మునుగోడులో బీసీ ఓటర్లు ఎక్కువ. అందులోనూ గౌడ సామాజికవర్గం కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. దాదాపు 35 వేల మందికి పైగానే ఆ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. నర్సయ్య గౌడ్ పార్టీని వీడి వెళ్లడంతో కాంగ్రెస్ లో ఉన్న పల్లె రవి, ఆయన సతీమణిని పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో టీఆర్ఎస్ ఉంది. ఈ మేరకు కేటీఆర్ తో వారు సమావేశమయ్యారని తెలిసింది. మరో వైపు టీఆర్ఎస్ నుంచి నేతలు జారి పోకుండా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమై బుజ్జగించారని తెలిసింది. ఇప్పుడు పార్టీ నుంచి నేతలు జారిపోకుండా చివరి వరకూ కాపాడుకోవడమే పెద్ద కష్టంగా మారింది.
కాంగ్రెస్ ను రెండు పార్టీలూ...
నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్ ను రెండు పార్టీలూ టార్గెట్ చేశాయి. మొన్నటి వరకూ అక్కడ బీజేపీ జీరో. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాకతో ఒక రకంగా బలం పెంచుకుంది. అయితే ఆయనతో పాటు ముఖ్యనేతలను కూడా పార్టీలోకి తీసుకు వచ్చి గెలుపును కన్ఫర్మ్ ను చేసుకోవాలని భావిస్తుంది. ఇందులో భాగంగానే నేతలను రప్పించడానికి, జారిపోకుండా చూసుకోవడానికి ముందు పార్టీ నేతలు కష్టాలపడాల్సి వస్తుంది. ఎటూ డబ్బులు వదులుతాయి. అందులో ఏ మాత్రం సందేహం లేదు. కానీ నేతలు వెళ్లిపోతే పార్టీకి ఎన్నికల ముందు ఇబ్బంది పడుతామన్న కారణంగా నష్ట నివారణ చర్యలు చేపడుతున్నారు. కాంగ్రెస్ కు ఎవరు వచ్చినా, వెళ్లినా పెద్ద నష్టం లేదు కాని, ప్రధానంగా నేతల జంపింగ్ లు బీజేపీ, టీఆర్ఎస్ నేతలకు నిద్రపట్టనివ్వడం లేదు.


Tags:    

Similar News