కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించి, లక్ష రూపాయల చెక్ అందించిన పవన్
కౌలు రైతుల కుటుంబాలకు జనసేన అన్నిరకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రామకృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆయన..
కొత్తచెరువు : కౌలు రైతుల కోసం జనసేన తలపెట్టిన కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా.. జనసేన అధినేత నేడు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని కొత్తచెరువు విజయనగర్ కాలనీలో అప్పుల బాధతో మృతి చెందిన రైతు రామకృష్ణ కుటుంబాన్ని పవన్ పరామర్శించారు. అనంతరం రామకృష్ణ భార్య సుజాతకు రూ.లక్ష చెక్ ను జనసేన తరపున అందజేశారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. కౌలు రైతుల కుటుంబాలకు జనసేన అన్నిరకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రామకృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆయన.. కౌలు రైతుల కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పవన్ వెంట జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యుడు నాగబాబు ఉన్నారు. కొత్తచెరువు నుంచి ప్రారంభమైన జనసేన యాత్రలో భాగంగా 28 మంది కౌలు రైతుల కుటుంబాలను పవన్ పరామర్శించనున్నారు. వారందరికీ లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. కాసేపట్లో పవన్ కల్యాణ్ అనంతపురం రూరల్ మండలం పూలకుంట, మన్నీల గ్రామాలకు చేరుకుంటారు.