రాజ్ భవన్ vs ప్రగతి భవన్... వార్ మొదలయిందా?

తెలంగాణలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు రిపబ్లిక్ వేడుకలపై స్పష్టంగా కన్పించాయి;

Update: 2022-01-26 08:54 GMT

తెలంగాణలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు రిపబ్లిక్ వేడుకలపై స్పష్టంగా కన్పించాయి. సంప్రదాయాలను పూర్తిగా పక్కన పెట్టారు. రాజ్యాంగాన్ని కూడా పెద్దగా పట్టించుకోలేదు. రానున్న ఎన్నికలే లక్ష్యంగా సాగుతున్న పోరాటం రిపబ్లిక్ డే వేడుకల్లో కన్పించడమేంటని కంగారు పడుతున్నారా? అవును నిజం. గణతంత్ర వేడుకలు తెలంగాణలో ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేశాయి. భవిష్యత్ లో రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ అన్నట్లుగా వ్యవహారం ఉండనుందన్నది వాస్తవం.

రిపబ్లిక్ డే వేడుకలకు....
రాజ్ భవన్ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ జాతీయ జెండా ఎగురవేశారు. కరోనా తీవ్రత కారణంగా ఈసారి రిపబ్లిక్ డే వేడుకలను రాజ్ భవన్ లోనే నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం గవర్నర్ నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కావాల్సి ఉంది. కానీ కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. కనీసం మంత్రులు కూడా రాజ్ భవన్ కు దూరంగా ఉన్నారు. గవర్నర్ ఒక్కరే అధికారులతో కలసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తన ప్రసంగంలోనూ...
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో జెండా ఎగురవేశారనుకోండి. అయితే రాజ్ భవన్ కు ఎందుకు రాలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గవర్నర్ తమిళి సై కూడా తన ప్రసంగంలో ఎక్కడా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను గురించి ప్రస్తావించలేదు. కోవిడ్ ను అధిగమించడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు, హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి వంటి వాటిపైనే మాట్లాడారు. దీంతో ముఖ్యమంత్రికి, గవర్నర్ కు మధ్య గ్యాప్ బాగానే ఉందనిపిస్తోంది.
రాజకీయ యుద్ధం ఉన్నా....
ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై కాలు దువ్వుతున్నారు. బీజేపీ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. అయితే అవి రాజకీయ పోరాటాలు. గవర్నర్ కు వాటితో ఎటువంటి సంబంధం ఉండదు. కానీ గవర్నర్ జరిపిన రిపబ్లిక్ వేడుకలకు సీఎం వెళ్లకపోవడం రాజ్యాంగ విరుద్ధమన్న విమర్శలు విన్పిస్తున్నాయి. సంప్రదాయాన్ని అనుసరించలేదని, కనీసం మంత్రులను కూడా పంపకుండా గవర్నర్ ను అవమానించారని పలువురు అంటున్నారు. మొత్తం మీద ఈరోజు జరిగిన రిపబ్లిక్ డే వేడుకలు ప్రగతి భవన్, రాజ్ భవన్ ల మధ్య మరింత దూరాన్ని పెంచాయని చెప్పక తప్పదు.



Tags:    

Similar News