వాణీ జయరామ్ మృతి.. కారణం అదేనా?

ప్రముఖ గాయని వాణీ జయరామ్ మృతి చెందారు. చెన్నైలోని తన స్వగృహంలో ఆమె మరణించారు

Update: 2023-02-04 11:46 GMT

ప్రముఖ గాయని వాణీ జయరామ్ మృతి చెందారు. చెన్నైలోని తన స్వగృహంలో ఆమె మరణించారు. బాత్‌రూంలోకి వెళ్లి జారిపడటంతో తలకు గాయం కావడంతో ఆమె మృతి చెందారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వాణిజయరామ్ కు పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించింది. ఆ అవార్డును అందుకోక ముందే ఆమె సుదూర తీరాలకు తరలి వెళ్లిపోయారు. 1945లో జన్మించిన వాణిజయరామ్ పలు భాషల్లో వేల సంఖ్యలో పాటలు పాడారు. దురైస్వామి, పద్మావతి దంపతులకు వాణిజయరామ్ జన్మించారు.

విశ్వనాధ్ సినిమాల్లో...
వాణిజయరామ్ స్వస్థలం వెల్లూరు. ఆమె అసలు పేరు కలైవాణి. ఆకుటుంబంలో ఆరుగురు అక్కా చెల్లెళ్లు కాగా, వాణి జయరామ్ ఐదో సంతానం. 1970లో గుడ్డీ చిత్రం ద్వారా బ్యాక్‌గ్రౌండ్ సింగర్ గా వాణీ జయరామ్ మారారు. అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు. అభిమావంతుడు చిత్రం ద్వారా తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. కె. విశ్వనాథ్ మరణించిన రెండో రోజే ఆమె మృతి చెందడం విశేషం. ఆయన ప్రతి చిత్రంలో వాణీ జయరామ్ పాట కుండా ఉండలేదు. శంకరాభరణం నుంచి సిరివెన్నెల వరకూ ఆమె పలు చిత్రాల్లో పాటలు పాడారు.
19 భాషల్లో....
వాణీ జయరామ్ తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ, భోజపురి, మరాఠీ ఒరియా వంటి పథ్నాలుగు భాషల్లో పాటలు ఆలపించారు. ఆమె గొంతులో ఒక జీర ఉంది. అదే ప్రేక్షకులకు ఆమెను దగ్గరకు చేర్చింది. ఆమె పాటలు ఒక్కటా.. రెండా.. అన్ని సూపర్ డూపర్ హిట్లే. తన గాత్రంతో ప్రేక్షకుల మనసులను రంజింప చేశారు. ప్రఖ్యాత దర్శకులు అందరి వద్ద పాటలు పాడారు. అలాగే ప్రముఖ నేపథ్య గాయకులతో కలసి ప్రేక్షకులకు తన గానామృతాన్ని పంచిపెట్టారు. వాణిజయరామ్ మరణంతో సంగీత ప్రపంచం శోకసంద్రంగా మారింది. టాలివుడ్ 24 గంటలు గడవక ముందే మరో విషాదాన్ని వినాల్సి వచ్చింది.
మృతిపై అనుమానాలు...
అయితే ఆమె మృతిపై అనేక అనుమానాలు వెలువడుతున్నాయి. అనుమానస్పద రీతిలో మరణించడంతో పోలీసులు వాణీ జయరామ్ మృతిని సీరియస్ గా తీసుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి పరిశీలిస్తున్నారు. ఆమె బాత్ రూంలో జారిపడి దెబ్బలు తగిలాయా? లేక ఎవరైనా ఆమెపై హత్యాయత్నం చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇరవై వేలకు పైగా పాటలు పాడిన వాణిజయరామ్ మృతి వార్త విని అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె 19 భాషల్లో పాటలు పాడి మేటి గాయనిగా పేరు తెచ్చుకున్న వాణీ జయరామ్ మృతితో మరో కోయిలను కోల్పోయినట్లయింది.


Tags:    

Similar News