టీఆర్ఎస్ బీజేపీకి ‘బీ టీం’

Update: 2018-11-28 08:22 GMT

బీజేపీకి టీఆర్ఎస్ బీ టీం అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బుధవారం ఆయన కొడంగల్ బహిరంగ సభలో మాట్లాడుతూ... టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదని... టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్రీయ సంఘ్ పరివార్ అని ఆరోపించారు. దేశంలో ప్రజల మధ్య విభజన తీసుకువస్తూ... దళితులు, ఆదివాసిలు, మైనారిటీలపై వివక్ష చూపిస్తున్న నరేంద్ర మోదీకి కేసీఆర్ మద్దతు ఇస్తున్నారని అన్నారు. లోక్ సభలో, రాజ్యసభలో నరేంద్ర మోదీకి అవసరమైనప్పుడు టీఆర్ఎస్ పూర్తిగా మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. నిజంగా కేసీఆర్ తెలంగాణవాది అయితే నరేంద్ర మోదీకి మద్దతు ఇచ్చేవారు కాదన్నారు. బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీలను అడిగితే కేసీఆర్ ఆదేశాలతోనే మోదీకి మద్దతు ఇస్తున్నట్లు టీఆర్ఎస్ ఎంపీలు చెప్పారని ఆరోపించారు. నరేంద్ర మోదీని మళ్లీ ప్రధానిని చేయడమే కేసీఆర్ ఏకైక లక్ష్యమన్నారు. నిన్న నరేంద్ర మోదీ వచ్చినప్పుడు కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పారని, మరి, అదే నిజమైతే రాఫేల్, భూసేకరణ చట్టం విషయంలో బీజేపీపై కాంగ్రెస్ పోరాడినప్పుడు టీఆర్ఎస్ ఎందుకు కలిసిరాలేదని ప్రశ్నించారు.

Similar News