మునుగోడు బైపోల్ : ప్రగతి భవన్ నుంచే మానటరింగ్

మునుగోడు ఉప ఎన్నికల్లో పథకాలే గెలిపిస్తాయన్న నమ్మకంతో అధికార టీఆర్ఎస్ పార్టీ ఉంది

Update: 2022-10-26 06:04 GMT

మునుగోడు ఉప ఎన్నికల్లో పథకాలే గెలిపిస్తాయన్న నమ్మకంతో టీఆర్ఎస్ ఉంది. తమ ప్రభుత్వం అమలు చేేసిన పథకాలను అధికార పార్టీకి ఓటేసి గెలిపిస్తే మరింత దగ్గరవుతాయన్న నమ్మకంతో ఓటర్లు ఉన్నట్లు కనపడుతుంది. టీఆర్ఎస్ కూడా అదే ధీమాతో ఉంది. రైతు బంధు కార్యక్రమంతో పాటు దళిత బంధువంటి పథకాలు తమకు వెంటనే అప్లయ్ అవుతాయని ఓటర్లు భావించే దిశగా టీఆర్ఎస్ ప్రచారం సాగుతుంది. రైతు బంధు కార్యక్రమంతో ఇప్పటికే రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటుందని, భవిష్యత్ లో మరింత అండగా ఉంటుందన్న భరోసాను అధికార పార్టీ తన ప్రచారంలో ఇస్తుంది.

చౌటుప్పల్ మండలంలో...
ఇక ప్రధానంగా తమ ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్ మండలంలో బలంగా ఉన్నారని గమనించింది. అందుకే అక్కడ ప్రత్యేక వ్యూహాన్ని టీఆర్ఎస్ అమలు చేస్తుంది. ఇప్పటికే ఆ మండలానికి మంత్రి శ్రీనివాసగౌడ్ ను ఇన్‌ఛార్జిగా నియమించింది. మంత్రి కేటీఆర్ కూడా మునుగోడును దత్తత తీసుకుంటానని ప్రకటించడమే కాకుండా ఇటీవల చౌటుప్పల్ చేసిన రోడ్ షో విజయవంతం అయింది. చౌటుప్పల్ లో కనుక కోమటిరెడ్డిని వెనకకు నెట్టగలిగితే తాము సులువుగా విజయం సాధించగలమన్న నమ్మకంతో టీఆర్ఎస్ అధినాయకత్వం ఉంది.
ప్రత్యేక వ్యూహంతో...
మునుగోడులో ప్రత్యేక వ్యూహాన్ని కేసీఆర్ అమలు పరుస్తున్నారు. ప్రతి రోజూ టెలికాన్ఫరెన్స్ ద్వారా నేతలతో మాట్లాడి వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఎక్కడ ఏ ప్లాన్ అమలు చేయాలో ప్రగతి భవన్ నుంచే సూచనలు అందుతున్నాయి. సామాజికవర్గాల వారీగా, గ్రామాల వారీగా ప్రజలను ఆకట్టుకునేందుకు కేసీఆర్ సరికొత్త ప్రయోగాలను మునుగోడులో చేస్తున్నారు. ప్రతి గ్రామానికి ఒక ఎమ్మెల్యేను ఇన్‌ఛార్జిగా నియమించారు. ఆ గ్రామంలో ఖచ్చితంగా మెజారిటీ వచ్చే విధంగా స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. ఆ గ్రామాల్లో ఏ సామాజికవర్గం అధికంగా ఓటర్లు ఉంటే ఆ సామాజికవర్గం నేతనే ఇన్ ఛార్జిగా నియమించారు.
పనితీరును...
ఇక ఇప్పటికే మునుగోడు అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించక ముందు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈనెల 30వ తేదీన మరో బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు కేసీఆర్ హాజరుకానున్నారు. తాను నియమించిన ఎమ్మెల్యేల పనితీరును కూడా ఈ ఎన్నిక ద్వారా బేరీజు వేస్తానని కేసీఆర్ అంతర్గత సమావేశాల్లో హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో ఎమ్మెల్యేలంతా నిర్విరామంగా పనిచేస్తున్నారు. మంత్రులు మునుగోడును వదలకుండా అక్కడే మకాం వేసి తమకు అప్పగించిన ప్రాంతంలో కారు పార్టీకి మెజారిటీని సాధించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. బీజేపీని అన్ని రకాలుగా దెబ్బకొట్టాలంటే మునుగోడు ఉప ఎన్నికలో గెలిచి తీరాలని లక్ష్యాన్ని విధించారు. బీఆర్ఎస్ సక్సెస్ కావాలన్నా మునుగోడులో గెలుపు టీఆర్ఎస్ కు ముఖ్యమన్న భావనతో నేతలు కష్పడుతున్నారు. మరి చివరకు ఫలితం ఎలా ఉంటుందో చూడాలి మరి.
Tags:    

Similar News