బయటకు వెళుతున్నా... ఎవరికీ భయపడను

కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు.

Update: 2022-02-19 11:48 GMT

కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. తాను పార్టీలో ఉండి ఇబ్బంది పడలేనని, అలాగే కాంగ్రెస్ ను కూడా ఇబ్బంది పెట్టలేనని ఆయన తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను కరెక్టుగా ఉన్నాను కాబట్టే వాస్తవాలు మాట్లాడుతున్నానని చెప్పారు. తాను ఎవరికీ భయపడబోనని అన్నారు. ఉన్నది ఉన్నట్లు మాట‌్లాడటం తన స్వభావమని జగ్గారెడ్డి తెలిపారు.

వ్యక్తిగత దాడిని....
తనపై వ్యక్తిగత దాడిని భరించలేకపోతున్నానని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే రాష్ట్ర విభజన సరికాదని తాను చెప్పానని జగ్గారెడ్డి గుర్తు చేశారు. జగ్గారెడ్డి వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని కాంగ్రెస్ లో ఒకవర్గం ప్రచారం చేస్తుందని ఆరోపించారు. వ్యక్తులు ముఖ్యం కాదని, వ్యవస్థ ముఖ్యమని అన్నారు. చరిత్ర ఉన్న పార్టీలో ఉండాలనుకునే ఇన్నాళ్లు ఉన్నానని ఆయన చెప్పారు. తాను వెళ్లదలచుకుంటే ఎప్పుడో వెళ్లేవాడినని తెలిపారు. తాను ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లనని, స్వతంత్రంగానే వ్యవహరిస్తానని జగ్గారెడ్డి చెప్పారు. తాను బయటకు పోవడం వల్ల రాజకీయంగా తనకు, కాంగ్రెస్ కు పెద్దగా నష్టం వచ్చేది లేదని తెలిపారు.
మూడు రోజుల్లో రాజీనామా....
తనపై రోజూ బురద జల్లుతున్నారు కాబట్టి మనస్తాపానికి గురయ్యానని చెప్పారు. తాను బయటకు వెళ్లిపోతే బాగుంటుందని కొందరు భావిస్తున్నారు కాబట్టి తాను పార్టీకి దూరం అవుతున్నానని చెప్పారు. తాను ఈరోజే రాజీనామా చేయలనుకున్నానని, కొందరు పెద్దలు వారించబట్టి ఈరోజు ఆగానని తెలిపారు. ప్రస్తుతానికి తాను రాజీనామా ఆలోచనను తాత్కాలికంగా విరమించుకున్నానని, అంతేతప్ప కాంగ్రెస్ లో ఉండే ప్రసక్తి లేదని జగ్గారెడ్డి చెప్పారు. రెండు మూడురోజుల్లో అందరినీ ఒప్పించి రాజీనామా చేస్తానని జగ్గారెడ్డి తెలిపారు. తాను బయటకు వెళ్లినా సోనియా, రాహుల్ గాంధీ పట్ల విధేయతతోనే ఉంటానని చెప్పారు. ముఖ్యమంత్రిని కలిస్తే దుష్ప్రచారం చేశారన్నారు. తన నియోజకవర్గానికి వచ్చిన మంత్రి కేటీఆర్ ను కలిస్తే తప్పుపట్టారన్నారు. తాను స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉంటే ఎవరినైనా కలసి సంగారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News