ముద్రగడ రీ ఎంట్రీకి రెడీ అయిపోయారా?
సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది
ముద్రగడ పద్మనాభం ఇటీవల యాక్టివ్ అయ్యారు. ఇది నిజంగా సమస్యలపైన ఆయన చలించిపోతున్నారా? లేదా రాజకీయాల్లో రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నారా? అన్నది ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ముద్రగడ మనసులో ఏముంది? ఆయన రాజకీయాల పట్ల ఆసక్తి కనపరుస్తున్నారా? అన్న సందేహం కలుగుతుంది. ఇటీవల కాలంలో వివిధ సమస్యలపై లేఖలు రాస్తూ ముద్రగడ తన దైన ముద్రను వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి...
ముద్రగడ పద్మనాభం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి దశాబ్దాలు గడుస్తుంది. ఆయన ఏ పార్టీలో లేకుండా కాపు రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించి సొంత సామాజికవర్గం ప్రయోజనాల కోసం పోరాడారు. రాజకీయంగా ఏ పార్టీకి దగ్గర కాలేదు. దూరం కాలేదు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా సుముఖత వ్యక్తం చేయలేదు. ఇక టీడీపీ హయాంలో జరిగిన కాపు రిజర్వేషన్ పోరాటంలో తన కుటుంబం అవమానం పాలయిందని ముద్రగడ పద్మనాభం భావించారు.
ఉద్యమం నుంచి....
అందుకే ఆరు నెలల క్రితం ఆయన తాను కాపు రిజర్వేషన్ల పోరాటం నుంచి తప్పుకుంటున్నట్లు ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. అప్పటి నుంచి కొంతకాలం సైలెంట్ గానే ఉన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన పెద్దగా యాక్టివ్ గా లేరు. కానీ ఇటీవల కాలంలో ముద్రగడ పద్మనాభం మళ్లీ యాక్టివ్ అయ్యారు. వివిధ సమస్యలపై ఆయన వరస లేఖలతో నిత్యం వార్తల్లో ఉంటున్నారు.
అందుకేనా?
చంద్రబాబు కు తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేస్తూ లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించవద్దంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఇవన్నీ చూస్తుంటే ముద్రగడ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లే కన్పిస్తుంది. మొత్తం మీద ముద్రగడ రాజకీయాల్లోకి మళ్లీ వస్తే ఏ పార్టీలో చేరతారన్నది ఆసక్తికరంగా మారింది.