ఈయన కనిపించి ఎన్నాళ్లయింది?
ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మంత్రి పదవి చేపట్టి రెండున్నరేళ్లు దాటుతున్నా ఆయన పెద్దగా ఫోకస్ కాలేదు.
పినిపే విశ్వరూప్. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి. మంత్రి పదవి చేపట్టి రెండున్నరేళ్లు దాటుతున్నా ఆయన పెద్దగా ఫోకస్ కాలేదు. ఆయనకు ఫోకస్ అయ్యే ఉద్దేశ్యం లేనట్లే కన్పిస్తుంది. అమలాపురం, రాజోలు శాసనసభ నియోజకవర్గాలకే ఆయన మంత్రి అన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఈయనకు మంత్రి పదవి కొత్తేమీ కాదు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య, నల్లపురెడ్డి ప్రసన్న కుమారెడ్డి క్యాబినెట్ లో పనిచేసిన అనుభవం ఉంది.
వివాదాలకు దూరంగా...
అయినా పినిపే విశ్వరూప్ ఈ రెండున్నరేళ్లలో ఇటు వివాదాలకు కాని, అటు ఆరోపణలకు కాని లోను కాలేదు. ఆయనకు వాస్తవంగా రాజోలు నియోజకవర్గంపైనే ఎక్కువ మక్కువ. అందుకే ఆయన రాజోలు రాజకీయాల్లో వేలు పెడుతున్నారంటారు. కానీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఎప్పుడూ సమీక్ష జరిపిన పాపాన పోలేదు. ప్రభుత్వంలోనూ ఏదో అంటీ ముంటనట్లుగా వ్యవహరిస్తారు.
కేబినెట్ మీట్ లకు తప్ప....
మంత్రి వర్గ సమావేశాలకు హాజరు కావడం తప్పించి ఎక్కడా కనపడకపోవడంతో ఈయన మంత్రివర్గంలో ఉన్నట్టా? లేనట్లా? అన్న చర్చ పార్టీలోనే జరుగుతుండటం విశేషం. మంత్రిగా ఆయన అధికారులతో టచ్ లో ఉండి ఉండవచ్చు. ఆయన శాఖలో ఏం జరుగుతుందన్న విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత మంత్రిపై ఉంది. కానీ విశ్వరూప్ మాత్రం ఈ శాఖ విషయంలో ఏనాడు మీడియాతో పంచుకున్న సందర్భం లేదనే చెప్పాలి.
జిల్లా రాజకీయాల్లోనూ....
ఇక తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్లోనూ ఆయన పెద్దగా చురుగ్గా లేరనే చెప్పాలి. తూర్పు గోదావరి జిల్లాలో కురసాల కన్నబాబు, వేణుగోపాల కృష్ణ, విశ్వరూప్ ముగ్గురు మంత్రులుగా ఉన్నారు. విశ్వరూప్ తప్ప మిగిలిన ఇద్దరూ యాక్టివ్ గా ఉన్నారు. ఈయన మాత్రం కారణమేదో తెలియదు కాని అసలు పార్టీ వ్యవహారాలను కూడా జిల్లాలో పట్టించుకోలేదంటారు. అందుకు కారణం పార్టీలో తగిన గుర్తింపు, ప్రాధాన్యత లభించకపోవడమే. ఏది ఏమైనా ఈయన మంత్రిగా ఉన్నారా? లేదా? అన్న డౌటు తూర్పు గోదావరి జిల్లా వాసులకే కొడుతుండటం విశేషం.