రజనీ దెబ్బకు అక్కడ టీడీపీ విజయం గ్యారంటీనట
సూపర్ స్టార్ రజనీకాంత్‌పై వైసీపీ నేతలు చేసిన విమర్శలు చంద్రబాబు తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత కోరుకున్నట్లుగానే జరుగుతుంది. ఆయన అనుకున్నట్లుగానే వెళుతుంది. ప్రధానంగా చిత్తూరు జిల్లాలో తమ బలం పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. రజనీకాంత్ రూపంలో చంద్రబాబుకు మంచి ఆయుధం దొరికినట్లయింది. వైసీపీ నేతలు వెనకా ముందు చూసుకోకుండా చేసిన విమర్శలు ఇప్పడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. చంద్రబాబుకు లాభం, వైసీపీకి నష్టాన్ని తెచ్చి పెట్టనున్నాయి. ఇవన్నీ స్పురణ లేకుండా వైసీపీ నేతలు సూపర్ స్టార్ రజనీకాంత్‌పై విమర్శలు చేయడంతో చంద్రబాబు కూడా అంతా మన మంచికేనంటున్నారు.
అనుకూలంగా...
వైసీపీ నేతలు కొడాలి నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా వంటి నేతలు రజనీకాంత్‌పై విమర్శలు చేయడాన్ని టీడీపీ తమకు అనుకూలంగా మలచుకుంటుంది. చిత్తూరు జిల్లాలోని కుప్పం, నగరి వంటి నియోజకవర్గాల్లో తమిళుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అక్కడ రజనీకాంత్ ప్రభావం కూడా లేదని చెప్పలేం. ఖచ్చితంగా తమిళనాడులో ఉన్నట్లే ఆ ప్రాంతాల్లో కూడా రజనీకాంత్ అంటే అనేక మందికి అభిమానం ఉంటుంది. కానీ వైసీపీ నేతలు రజనీకాంత్ ఆరోగ్యంతో పాటు అనేక అంశాలపై చేసిన విమర్శలు ఇప్పుడు వైసీపీకి ఇబ్బందికరంగా మారనున్నాయి.
నగరిలోనూ...
కుప్పం, నగరి వంటి నియోజకవర్గాల్లో తమిళులు మాట్లాడే వారు ఎక్కువగా ఉన్నారు. వారంతా ఇక్కడ ఉన్నా తమిళనాడుకు చెందిన వారే. తమిళ భాషను కూడా అనర్గళంగా మాట్లాడగలరు. రోజా రెండు సార్లు వరసగా గెలిచారంటే తమిళుల ప్రభావం కూడా ఎక్కువగా ఉందని చెబుతారు. అలాంటిది తమిళులు ఆరాధ్య దైవంగా భావించే రజనీకాంత్‌ను వైసీపీ నేతలు విమర్శించడాన్ని టీడీపీ నేతలు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి కింది స్థాయి వరకూ తమిళ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్ క్షమాపణ చెప్పాల్సిందేనంటూ చంద్రబాబు సయితం డిమాండ్ చేస్తున్నారు.
కుప్పంలో...
ఇదంతా కుప్పంలో తనకు సానుకూల వాతావరణం ఏర్పాటు చేసుకోవడం కోసమే చంద్రబాబు దీనిని రాద్ధాంతం చేస్తున్నారని గ్రహించేలోపు వైసీపీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రజనీకాంత్ ను సమర్థిస్తూ ట్విట్టర్‌లో నేడు ట్రెండింగ్‌గా మారింది. రజనీకి క్షమాపణ చెప్పాలంటూ ఆయన ఫ్యాన్స్ ట్విట్టర్‌లో దండెత్తారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు విజయవాడకు వచ్చిన రజనీకాంత్ తన చిరకాల మిత్రుడైన చంద్రబాబును పొగిడారు. అది ఓర్వలేని వైసీపీ నేతలు విమర్శలు చేయడంతో ఇప్పుడు దానిని తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు టీడీపీ నేతలు.