బన్సల్ ఇలా మెలిక పెట్టాడేంటి?
తెలంగాణ భారతీయ జనతా పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్ బన్సల్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి.
తెలంగాణ భారతీయ జనతా పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్ బన్సల్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గ ఇన్‌ఛార్జులు పోటీ చేయడానికి వీలు లేదని చెప్పారు. పార్టీ బలోపేతానికి ఆ నియోజకవర్గాల్లో కృషి చేయాల్సి ఉంటుందన్నారు. ఇన్ ఛార్జులు కాకుండా కొత్త వారిని అభ్యర్థులుగా ఎంపిక చేస్తామని చెప్పడంతో ఇన్‌ఛార్జులు ఉలిక్కిపడ్డారు. తమకు ఇన్‌ఛార్జి పదవి వద్దంటూ వారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు మొరపెట్టుకున్నారు.
బలోపేతం చేయడానికే...
సునీల్ బన్సల్ ను పార్టీ అధినాయకత్వం నియమించింది తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడానికే. ఉత్తర్‌ప్రదేశ్ లో ఆయన వ్యవహరించిన తీరు హైకమాండ్ ను ఆకట్టుకోవడంతో, ఆయన సరికొత్త వ్యూహాలతో తెలంగాణలోనూ పార్టీని విజయపథాన నడిపిస్తారని భావించి ఉండవచ్చు. ఆయన పార్టీ ఇన్‌ఛార్జి పదవి చేపట్టిన తర్వాత తెలంగాణ పరిస్థితులపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు. 119 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఆయనకు అవగాహన రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశముందని చెబుతున్నారు.
ఇన్‌ఛార్జులు ఎవరూ...
అయితే బీజేపీ విధానాల ప్రకారం ఇన్‌ఛార్జులు ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలులేదు. ఆ మాటే బన్సల్ చెప్పారు. పార్టీని కష్టపడి గెలిపించే బాధ్యత ఇన్‌ఛార్జులకే బీజేపీ అప్పగిస్తుంది. అభ్యర్థులు ఎన్నికల సమయంలో ప్రచారంలో ఉంటే గెలుపు వ్యూహాలన్నీ ఇన్ ఛార్జులు అమలుపర్చాల్సి ఉంటుంది. బీజేపీ వ్యూహం అదే. అందుకనే సునీల్ బన్సల్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారు. మిగిలిన పార్టీల్లో అలా కాదు. ఇన్‌ఛార్జులకే దాదాపు టిక్కెట్లు దక్కుతాయి. అలాగే బీజేపీ నేతలు భావించి ఉంటారు. అందుకే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు దక్కాలంటే ఇన్‌ఛార్జి పదవి తీసుకోవడం ఉత్తమమని వారు అంగీకరించారు.
ఆయన ప్రకటనతో...
లేకుంటే తమను నియమించినప్పుడే అభ్యంతరం వ్యక్తం చేసేవారు. బన్సల్ ఈ ప్రకటన చేసిన వెంటనే యండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాసరెడ్డి, ధర్మారావు, స్వామిగౌడ్, విఠల్, బండ కార్తీక్ రెడ్డిలు తమను ఇన్‌ఛార్జి పదవి నుంచి తప్పించాలని కోరుతున్నారు. వేరే వారికి ఇన్‌ఛార్జి పదవిని అప్పగించాలని వారు కోరుతున్నారు. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆరు నెలల వరకూ ఇన్‌ఛార్జులుగా కొనసాగాలని, ఆ తర్వాత సొంత నియోజకవర్గాల్లో పనిచేసుకునే అవకాశం కల్పిస్తామని ఆయన సర్దిచెప్పాల్సి వచ్చింది. అలాగయితే 119 నియోజకవర్గాల్లో ఎవరూ ఇన్‌ఛార్జులుగా పనిచేయరన్నది నేతల నుంచి వినపిస్తున్న కామెంట్స్.