తెలంగాణ రాష్ట్ర సమితిపై తెలుగుదేశం పార్టీ విరుచుకుపడింది. హైదరాబాద్ లోని ఏపీ డీజీపీ కార్యాలయాన్ని పొలిటికల్ డెన్ గా మార్చారని, ఇంటలిజెన్స్ అధికారులతో సర్వే చేయిస్తూ, ప్రజలకు డబ్బు సంచులు ఎరవేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, బాల్క సుమన్ లు ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. సెక్షన్ 8ను చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పందించారు.
2024 వరకూ హక్కుంది......
తెలుగుదేశం పార్టీపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. హైదరాబాద్ కామన్ క్యాపిటల్ అని, 2024 వరకూ హైదరాబాద్ పై తమకు హక్కులున్నాయన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. సెక్షన్ 8 ప్రకారం తమకు పూర్తి హక్కులున్నాయన్నారు. విభజన చట్టంలో ఏముందో తెలియదా? అని ప్రశ్నించారు. తాము ఎటువంటి సర్వేలు చేయించడం లేదని, డబ్బులు పంచే సంస్కృతి తమది కాదన్నారు. టీఆర్ఎస్ అధినేతకు రాజకీయ జన్మనిచ్చింది తెలుగుదేశం పార్టీయేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు బోండా ఉమ. పోలీసులను అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్ అరాచకాన్ని సృష్టిస్తోందన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీపై తప్పుడు ప్రచారం మానుకోవాలని ఆయన హితవు పలికారు.