చంద్రన్న శపథం.. నేతల్లో టెన్షన్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పార్టీని పట్టించుకోలేదన్న విషయం ఇప్పుడు స్పురణకు వచ్చినట్లుంది.

Update: 2022-09-04 06:55 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పార్టీని పట్టించుకోలేదన్న విషయం ఇప్పుడు స్పురణకు వచ్చినట్లుంది. ఆయన పదే పదే తాను గతంలో టీడీపీ ఓడిపోయిన రెండుసార్లు పార్టీని పట్టించుకోలేదని చెబుతున్నారు. తన నిర్లక్ష్యం వల్లనే పార్టీ రెండుసార్లు ఓటమి పాలయిందని ఆయన తనంతట తానుగా ఒప్పేసుకుంటున్నారు. అంతే కాదు తనలో తప్పులుంటే సరిదిద్దుకుంటానని, అలాగే నేతలు కూడా ఇగోలను వదిలి పెట్టి తాము పార్టీకి లాభం చేస్తున్నామా? నష్టం చేస్తున్నామా? అన్నది ఆలోచించాలని చంద్రబాబు నేతలకు పిలుపు నిస్తున్నారు.

శపథం చిక్కులు తేకుండా...
చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి రావాల్సి ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రిగానే శాసనసభలో అడుగుపెడతానని శపథం చేసి మరీ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు. అధికారంలోకి పార్టీ రాకపోయి తాను గెలిచినా ఫలితం ఉండదు. శాసనసభలో అడుగుపెట్టలేని పరిస్థితి. అందుకే వచ్చే ఎన్నికలు చంద్రబాబుకు జీవన్మరణ సమస్యగా మారింది. తాను ఈ వయసులో పడుతున్న కష్టం నేతలు పడటం లేదని పదే పదే ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ ఆవేదనగా ఉన్నా... అది ఆగ్రహంగా మారిపోయింది. నేతలకు నేరుగా వార్నింగ్ లు ఇస్తున్నారు.
సహజశైలికి విరుద్ధంగా...
చంద్రబాబు తన సహజశైలికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఆయన కర్ర విరగకుండా, పాము చావకుండా అన్నట్లు ఇన్నాళ్లు వ్యవహరించే వారు. అధికారంలో ఉన్నప్పుడు నేతలపై అజామాయిషీ చేసే చంద్రబాబు, అధికారంలో లేనప్పుడు మాత్రం వారిని చూసీ చూడనట్లు వదిలేసేవారు. కానీ ఇప్పుడు చంద్రబాబు చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధమయినట్లే కనిపిస్తుంది. అందుకే నేతలను పరుగులు తీయించేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. పరుగులు పెట్టకపోతే టిక్కెట్ దక్కదని హెచ్చరిక జారీ చేస్తున్నారు. అక్రమ కేసులతో జైలుకెళ్లిన వారికి టిక్కెట్ల ఖరారులో ప్రాధాన్యత ఇస్తామంటున్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఒప్పుకునేది లేదని, క్యాడర్ ను కాపాడలేని నేతలు పదవుల నుంచి తప్పు కోవాలని చెబుతున్నారు.
అంతా సెట్ చేశాకే....
ఇందులో మొహమాటానికి తావు లేదని, కష్టపడ్డ వారికే టిక్కెట్లు అని ఖరాఖండీగా చెబుతున్నారు. కష్టపడకుండా సీట్లు కావాలంటే కుదరదని, ఈసారి 40 శాతం యువతకే సీట్లు ఇస్తామని తనను అపార్థం చేసుకోవద్దని కూడా చంద్రబాబు నేతలకు క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో తాను చేసిన శపథాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని వ్యవహరించాలని ఆయన నేతలకు చెప్పడం చూస్తే రానున్న కాలంలో ఆయన తీసుకునే సీరియస్ నిర్ణయాలపై పార్టీలో విస్తృత స్థాయి చర్చ జరుగుతుంది. తప్పులను సరిదిద్దు కోకుండా సీటు ఎక్కడికి పోతుందిలే అనుకునే నేతలకు చంద్రబాబు ఇకపై నేరుగా క్లాస్ పీకాలని నిర్ణయించుకున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. ముందు నేతలను గాడిలో పెట్టి ఆ తర్వాత నియోజకవర్గాల పర్యటనకు వెళ్లాలన్నది చంద్రబాబు ఆలోచన. మరి చంద్రబాబు వార్నింగ్ లకు నేతలు భయపడతారా? గాడిలో పడతారా? అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News