ఆ ఏడింటిలో తాడో పేడో.. బాబు స్ట్రాటజీ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. శాసనసభ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో ఈసారి పార్టీ అభ్యర్థులు గెలిచి తీరాలన్న ధృఢ సంకల్పంతో ఉన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఆయన కొంత ఇబ్బంది పడ్డారు. తనను ఎవరూ కేర్ చేయడం లేదన్న భావనలో ఉన్నారు. అందుకే బలహీనంగా ఉన్న పార్లమెంటు నియోజకవర్గాలలో బలమైన అభ్యర్థులను ఈసారి బరిలోకి దింపేందుకు రెడీ అవుతున్నారు. ఇటు ఆర్థికంగానూ, అటు సామాజిక పరంగానూ అభ్యర్థులను అన్వేషణలో ఉన్నారు. జాతీయ స్థాయిలో తన పేరుతో పాటు పార్టీని దేశవ్యాప్తంగా గుర్తించేలా చర్యలు ప్రారంభించారు.
బలహీనంగా...
ఏడు పార్లమెంటు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది. ఇక్కడ రెండు దశాబ్దాల నుంచి గెలుపు అనేది టీడీపీకి దక్కకుండా పోతుంది. అందుకు అభ్యర్థుల ఎంపికతో పాటు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మధ్య సమన్వయ లేమి అని చంద్రబాబు గుర్తించారు. ఈసారి అలాంటి పొరపాట్లు లేకుండా చూసుకునేందుకు ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించారు. కొన్ని నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ కారణంగా ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచినా, పార్లమెంటు సభ్యులు మాత్రం ఓడిపోవడాన్ని గుర్తించారు.
గుర్తింపు లేదని...
పార్లమెంటు సభ్యులు తగినంత మంది లేకపోవడంతో చంద్రబాబు జాతీయ స్థాయిలో గుర్తింపు కోల్పోతున్నారు. ఎక్కువ మంది ఎంపీలు ఉంటే జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. 1999 ప్రాంతంలో తగినన్ని ఎంపీ స్థానాలు ఉండబట్టే జాతీయ స్థాయిలో ఆయన రాణించారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత గత ఎన్నికల్లో కేవలం మూడు స్థానాల్లోనే విజయం సాధించడంతో అసలు పట్టించకోవడం మానేశారు. అదే ఆయనను వేధిస్తుంది. అందుకే ఈసారి ఏడు నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు.
ఇరవై ఏళ్ల నుంచి...
రాజంపేట పార్లమెంటులో టీడీపీ 1999లో గెలిచింది. ఆ తర్వాత గెలుపు లేదు. 1984లో పాలకొండ్రాయుడు. 1999లో గునిపాటి రామయ్య టీడీపి నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత రాజంపేట టీడీపీకి దక్కలేదు. కాంగ్రెస్, వైసీపీలే విజయం సాధిస్తున్నాయి. కడప పార్లెమెంటును 1984లో మాత్రమే టీడీపీ గెలిచింది. అప్పుడు డీఎన్‌రెడ్డి గెలిచారు. ఆ తర్వాత గెలుపు ఊసే లేదు. తిరుపతి పార్లమెంటులోనూ 1998 లో చింతామోహన్ టీడీపీ నుంచి విజయం సాధించారు. ఇక అక్కడ టీడీపీ జెండా ఎగరలేదు. ఎమ్మెల్యే స్థానాలు గెలుస్తున్నా ఎంపీ స్థానం మాత్రం దక్కడం లేదు.
గెలుపు కోసం...
కర్నూలు పార్లమెంటులోనూ టీడీపీ రెండుసార్లు మాత్రమే గెలిచింది. 1999లో కేఈ కృష్ణమూర్తి గెలిచారు. ఆ తర్వాత గెలిచింది లేదు. నంద్యాల పార్లమెంటు కూడా అదే పరిస్థితి 1999లోనూ టీడీపీకి చివరి గెలుపు. ఇక నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో 1984,1999లో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. 1984లో పసల పెంచలయ్య, 1999లో రాజేశ్వరమ్మ గెలిచారు. ఇక అంతే అక్కడ టీడీపీ జాడే లేదు. ఒంగోలు పార్లమెంటునూ 1999లో చివరిసారి టీడీపీ విజయం సాధించింది. ఈ ఏడు పార్లమెంటు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. బలమైన అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలకు వచ్చిన ఓట్లే ఎంపీ అభ్యర్థులకు పడేలా చూసేందుకు ఈసారి ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిసైడ్ అయ్యారు.