బాబు ప్లాన్ మార్చారు... అలా దూసుకొస్తున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కొద్దిగా డీలా పడినా వెంటనే తేరుకుని జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
ఎవరికైనా ఓటమి గుణపాఠాలను నేర్పుతుంది. అవమానాలు అందలం ఎక్కించే దిశగానే అడుగులు పడతాయి. వరస ఓటములతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కొద్దిగా డీలా పడినా వెంటనే తేరుకుని జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏడు పదుల వయసులోనూ ఆయన నేల మీద తిరుగుతున్నారు. అవమానాలను దిగమింగుకుని ప్రజా సమస్యలపై ఆయన దృష్టి పెడుతున్నారు. ఆయన చెప్పినట్లుగానే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి చంద్రబాబు సిద్ధమయినట్లే కన్పిస్తుంది.
ఓటమిని....
చంద్రబాబు నిన్న కడప, నేడు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. నిన్న గాక మొన్న కన్నీళ్లు పెట్టుకుని ఈ రాజకీయాలు వద్దు అని వెళ్లిపోయిన చంద్రబాబు మళ్లీ ఎలా వచ్చారని ప్రశ్నించవచ్చు. ఆయన చెప్పినట్లుగానే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు అంత సులువుగా ఓటమిని అంగీకరించే నేత కాదు. కిందపడినా తనదే పై చేయి అని చెప్పుకునేటంతటి సమర్థత ఉన్న నేత.
మరింత దూకుడుగా...
అలాంటి చంద్రబాబు రానున్న కాలంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తారంటున్నారు. మూడు ప్రాంతాల్లో చంద్రబాబు భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మూడు రాజధానుల అంశాన్ని జగన్ ప్రభుత్వం వెనక్కు తీసుకున్న నేపథ్యంలో మరింత స్పీడ్ పెంచాలనుకుంటున్నారు. ఈ రెండున్నరేళ్లు ఏ ప్రాంతంలో అభివృద్ధి చేయకుండా జగన్ ప్రభుత్వం చేసిన నిర్వాకాన్ని చంద్రబాబు ప్రజల ముందు ఎండగట్టనున్నారు.
మూడు ప్రాంతాల్లో....
విశాఖ, అనంతపురం, తిరుపతి, విజయవాడల్లో సభలను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. వరద పరిస్థితులు తగ్గుముఖం పట్టిన తర్వాత వచ్చే నెలలో మూడు ప్రాంతాల్లో భారీ బహిరంగ సభల్లో జగన్ ప్రజాసమస్యలను ఏవిధంగా పక్క దారి పట్టిస్తారో చెప్పనున్నారు. బహిరంగ సభల ద్వారా తనను అసెంబ్లీలో ఏ విధంగా అవమానించిందీ కూడా చంద్రబాబు చెప్పనున్నారు. మొత్తం మీద చంద్రబాబు తొలుత సభల ద్వారా జనం ముందుకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.