Tiger : పది పులులు ఒకేసారి తెలుగు రాష్ట్రాలపై పడ్డాయా? వణికిపోతున్న ప్రజలు

పెద్దపులులు.. చిరుత పులులు.. ఇలా పది పులులు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో అలజడి రేపుతున్నాయి.

Update: 2024-12-10 12:47 GMT

పెద్దపులులు.. చిరుత పులులు.. ఇలా పది పులులు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో అలజడి రేపుతున్నాయి. ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఒకేసారి ఇన్నిపులులు గ్రామాల్లోకి రావడంతో అటవీ శాఖ అధికారులు కూడా వాటిని పట్టుకుని బంధించేందుకు చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించడం లేదు. కొన్ని చోట్ల పశువులు వాటికి ఆహారంగా మారుతున్నాయి. దీంతో ఇటు ప్రజలకు, అటు అటవీ శాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడు వచ్చిన పులులన్నీమగపులులుగా అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పులులు ఈ సీజన్ లోనే వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి తమ తోడు కోసం వెతుక్కుంటాయని చెబుతున్నారు.

జనావాసాల్లోకి వస్తుండటంతో...

పెద్ద పులులు, చిరుత పులులు అరణ్యాలనువదిలి జనావాసాల్లోకి వస్తున్నాయి. కుమురం భీం జిల్లాలో ఇటిక్యాలపాడులో పెద్దపులి పత్తిచేనులో ఉన్న లక్ష్మిపై పంజా విసిరింది. దీంతో లక్ష్మి మరణించింది. తర్వాత ఆ ప్రాంతంలోనే సురేష్ అనే యువకుడిపై దాడికి దిగింది.అయితే సురేష్ మాత్రం పెద్దపులి దాడికి గురై ప్రాణాపాయంనుంచి తప్పించుకున్నాడు. ఇటిక్యాలపాడులో తిరుగుతున్న పెద్దపులి ఇంతవరకూ అటవీ శాఖ అధికారులు పట్టుకోలేకపోయారు. డ్రోన్ కెమెరాలతో దాని సంచారం తెలుస్తున్నప్పటికీ దానిని బంధించేందుకు చేసిన ప్రయత్నాలు మాత్రం సఫలం కావడం లేదు. ఈ పెద్దపులి మహారాష్ట్ర నుంచి వచ్చిందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ జిల్లాలో కూడా మరో పెద్ద పులి సంచరిస్తుందని అటవీశాఖ అధికారులు గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాత్రం హెచ్చరికలు జారీ చేశారు.
ఏపీలో ఈ ప్రాంతాల్లో...
ఆంధ్రప్రదేశ్ లోనూ పలు చోట్ల చిరుత పులి సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో చిరుత పులి సంచరిస్తుండగా స్థానికులు చూసి వీడియో తీసి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ చిరుత పులి ఒడిశా అటవీ ప్రాంతం నుంచి వచ్చిందని చెబుతున్నారు. అలాగే అల్లూరి జిల్లాలోనూ మరో పులి సంచరిస్తుంది. వైఎస్ఆర్ జిల్లాలో పులితో పాటు పులిపిల్ల తిరుగుతూ కనిపించిందని స్థానికులు చెబుతున్నారు.తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు మండలంలో పశువులపై దాడి చేసింది. దానినిచిరుత పులిగా పాదముద్రలను చూసి అటవీ శాఖ అధికారులు గుర్తించారు.పశువులపై పడి వాటిని చంపేస్తున్నాయి. ప్రకాశం జిల్లా అర్థవీడు మండలంలోనూ పులి సంచారం ఉందని తేలింది. మేక కోసం వెళ్లిన ఆవును చంపేసిందని స్థానికులు చెబుతున్నారు. అనంతపురం జిల్లా కల్యాణ దుర్గం నియోజకవర్గంలోనూ, నెల్లూరు జిల్లా పెంచలకోన ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుండటం స్థానికుల కంట పడింది.దీంతో ఆ ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు.
తోడు కోసం వందల కిలోమీటర్లు...
మగపులులు ఆడపులులతో జత కట్టేందుకు వందల కిలోమీటర్లు దూరం ప్రయాణించి వెతుక్కుంటూ జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ సమయంలో పులి క్రూరంగా ఉంటుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా పులి కాని చిరుత పులి కాని ఒకసారి ఆహారం దొరికితే మరో వారం రోజుల వరకూ దానికి ఆకలి వేయదు. నీటికోసం కూడా పెద్దగా వెతకదన్నది అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.ఆహారం దొరికినప్పుడు ఒకేసారి ఇరవై కేజీల వరకూ తినడం పులి అలవాట్లలో ఒకటిగా చెబుతున్నారు. వేట చేసి ఆహారాన్ని ఒకసారి పొందిన తర్వాత తిరిగి అది ఆహారం కోసం ప్రయత్నించవని, దాడులు చేయవని అంటున్నారు. మొత్త పది పులులు రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతుండటం అటవీ శాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. వారంతా రేయింబవళ్లూ పులులను బంధించడానికి ప్రయత్నిస్తున్నా వీరు ఏర్పాటు చేసిన బోన్లకు చిక్కడం లేదు. దీంతో ప్రజలు పులి ఎప్పుడు దాడి చేస్తుందోనన్నభయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరి ఇంత పెద్ద సంఖ్యలో ఒకేసారి తెలుగు రాష్ట్రాల్లోని జనావాసాల్లో పులుల సంచారం ఉండటం ఇదే ప్రధమమని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.


Tags:    

Similar News