టీడీపీలో కట్టప్పలు వారేనా?

టీడీపీ అధినేత చంద్రబాబు కోవర్టులున్న విషయాన్ని స్వయంగా చెప్పడంతో మరోసారి పార్టీలో చర్చ జరుగుతుంది.

Update: 2021-12-10 06:42 GMT

తెలుగుదేశం పార్టీలో కోవర్టులున్నారా? పార్టీలో ఉంటూ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు కోవర్టులున్న విషయాన్ని స్వయంగా చెప్పడంతో మరోసారి పార్టీలో చర్చ జరుగుతుంది. కోవర్టుల విషయంలో ఇక ఉపేక్షించబోనని చంద్రబాబు జారీ చేసిన హెచ్చరికలు ఎవరిని ఉద్దేశించినవన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ సంధికాలంలో ఉంది.

కుక్కమూతి పిందెలెవరు?
తెలుగుదేశం పార్టీలో కుక్కమూతి పిందెలున్నారని చంద్రబాబు స్వయంగా అంగీకరించారు. ఇది తేలిగ్గా కొట్టిపారేయాల్సిన విషయం కాదు. పార్టీ ఓటమి పాలయిన రెండున్నరేళ్ల తర్వాత చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి 175 నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్ ఉంది. ఓటు బ్యాంకు కూడా ఉంది. గత ఎన్నికల్లో ఓడిపోతే ఓడిపోయి ఉండవచ్చు. కానీ నలభై శాతం ఓట్లను సాధించిందన్న విషయాన్ని విస్మరించకూడదు.
కుప్పం నుంచి....
కానీ తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత అనేక మంది నేతలు వైసీపీకి అనుకూలంగా మారారని తెలుస్తోంది. దాదాపు 70 నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉన్నట్లు చంద్రబాబుకు నివేదికలు అందాయి. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కూడా కోవర్టులే కారణమని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. దీంతో ఇప్పటి వరకూ నియోజకవర్గాల ఇన్ ఛార్జులుగా ఉన్న వారి పనితీరును పరిశీలించిన చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
సీనియర్ నేతలు సయితం...
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అక్కడి నేతలు కావాలని ప్రజాదరణ లేని నేతలు అభ్యర్థులుగా ప్రకటించడంతోనే అక్కడ జీరో రిజల్ట్ వచ్చాయని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. కేసులకు భయపడి కొందరు. ప్రలోభాలకు మరికొందరు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వారందరినీ ఏరివేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. మరి చంద్రబాబు ఎవరిపైన చర్యలు తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News