మునుగోడులో అంత ఈజీ కాదు

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి ఇక పది రోజులు మాత్రమే సమయం ఉంది. నవంబరు 1వతేదీతో ప్రచారం ముగియనుంది

Update: 2022-10-21 04:02 GMT

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి ఇక పది రోజులు మాత్రమే సమయం ఉంది. నవంబరు 1వతేదీతో ప్రచారం ముగియనుంది. దీంతో అన్ని పార్టీలూ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. సామాజికవర్గం పరంగా ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మరో వైపు సర్పంచ్ నుంచి ఎంపీటీసీ, ఎంపీపీ ల వరకూ ఎవరినీ వదలడం లేదు. తమ పార్టీలోకి లాగేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు చేరికలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఒక నేత చేరతానంటే వెంటనే వారికి కండువాలు కప్పేసి తమ పార్టీలోకి తెచ్చేసుకుంటున్నారు. కొందరిని బలవంతంగా కూడా ఒప్పిస్తున్నారు. కొందరికి ధనం మరికొందరికి మరో విధంగా ఎర వేసి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

నేతలు వచ్చినంత మాత్రాన...
అయితే నేతలు వచ్చినంత మాత్రాన ఓటర్లు అటు వైపు మొగ్గు చూపుతారా? అంటే కాదనే చెప్పాలి. సహజంగా నేతలపై ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. వారి అనుచరులు తప్ప సాధారణ ప్రజలు ఎవరూ తమ గ్రామ సర్పంచ్ ఎటువైపు వెళితే అటువైపు వెళ్లరు. తమకు నచ్చిన, తాము అనుకున్న వారికే ఓటు వేస్తారు. ఈ పరిస్థితుల్లో సర్పంచ్ లు, ఎంపీటీసీ, ఎంపీపీలు చేరినంత మాత్రాన ప్రచారంలో వేదికపైకి మరో నేత వస్తారే తప్ప అదనంగా ఓట్లు వచ్చే పరిస్థితి లేదన్నది గతంలో జరిగిన ఎన్నికల ఫలితాలే చాటి చెప్పాయి. కానీ పార్టీలన్నీ నేతలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి.
ఆ రెండు పార్టీలు...
టీఆర్ఎస్, బీజేపీలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయన్న విమర్శలు వినపడుతున్నాయి. ప్రతి గ్రామానికి ఒక ఎమ్మెల్యే ఇన్ ఛార్జిగా పనిచేస్తున్నారు. వారు గ్రామంలోనే తిష్ట వేసి సమస్యలను సత్వరం పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఇక మంత్రులయితే గ్రామాలను దత్తత తీసుకుంటామని ప్రకటిస్తున్నారు. మంత్రి కేటీఆర్ మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని చెప్పారు. సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదేనని ఆయన చెప్పుకొచ్చారు. గ్రామాల్లో రహదారులు, విద్యుత్తు వంటి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని అనేక మంది మంత్రలు కూడా గ్రామాలను దత్తత తీసుకుంటామని చెబుతున్నారు. ఇప్పటికే మంత్రి మల్లారెడ్డి ఆరెగూడెం గ్రామన్ని దత్తత తీసుకున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు మాత్రం చుండూరు మున్సిపాలిటీని దత్తత తీసుకుంటామని ప్రకటించారు.
కాంగ్రెస్ మాత్రం...
బీజేపీ కూడా బూత్ ల వారీగా ఇన్‌ఛార్జిలను నియమించి ప్రచారంలోకి దిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వల్లనే మునుగోడు ప్రజలు ఇప్పుడు అన్ని రకాలుగా లబ్దిపొందుతున్నారన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళుతుంది. స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగి అన్ని రకాలుగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సామాజికవర్గాల వారీగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చరిష్మా పనిచేస్తుందని ఆ పార్టీ నమ్ముతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం సైలెంట్ గా తన పనితాను చేసుకుపోతుంది. ప్రజల్లో రెండు పార్టీల పై ఉన్న వ్యతిరేకత తమకు లాభిస్తుందని నమ్ముతోంది. అందుకే నేతలు వెళ్లినా ప్రజలు తమ వెంటే ఉన్నారన్న విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ నేతలున్నారు. మొత్తం మీద మునుగోడులో మూడు పార్టీలూ విభిన్న వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. మరి చివరకు ఎవరిది విజయం అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News