అంత సులువు కాదట.. చెమటోడుస్తున్నారు మరి

గుజరాత్ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. బీజేపీ మరోసారి గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతుంది.

Update: 2022-11-16 08:30 GMT

గుజరాత్ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. బీజేపీ మరోసారి గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతుంది. 1995 నుంచి గుజరాత్ లో బీజేపీయే అధికారంలో ఉంది. ముఖ్యమంత్రులు మారినా గుజరాత్ పీఠంపై కమలం జెండా ఎగురుతూ వస్తుంది. ప్రధాని మోదీ 2014కు ముందు వరకూ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు వేసిన పునాదులు మరికొన్ని ఎన్నికల పాటు తమ పార్టీకి అనుకూలంగా పనిచేస్తాయని బీజేపీ నేతలు నమ్ముతున్నారు. దాదాపు మూడు దశాబ్దాల నుంచి గుజరాత్ లో బీజేపీ పాలనలోనే కొనసాగుతుంది.

సుదీర్ఘకాలం పాలన...
ఇంత సుదీర్ఘకాలం పాలనలో ఉండటంతో సహజంగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుంది. అదే బీజేపీ భయం. ప్రధానిగా మోదీ, కేంద్ర హోం మంత్రిగా అమిత్ షాలు హస్తినలో రాజ్యమేలుతున్నారు. వారికి తలవంపులు తేకూడదనుకుంటే గుజరాతీలు మరోసారి బీజేపీని గెలిపించాలని బీజేపీ నినాదం చేస్తుంది. మోదీకి ఉన్న చరిష్మా గుజరాత్ ఎన్నికలలో మరోసారి పనిచేస్తుందని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. గుజరాతీలు తమకు మరోసారి అండగా నిలుస్తారన్న ఆత్మవిశ్వాసంతో పార్టీ నేతలున్నారు. అయితే బీజేపీ అంత తేలికగా మాత్రం ఎన్నికలను తీసుకోవడం లేదు.

గత ఎన్నికల్లోనే...
2017 ఎన్నికల్లోనే బీజేపీ ఇబ్బంది పడింది. కాంగ్రెస్ గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చింది. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ లో గత ఎన్నికల్లో కేవలం 99 స్థానాలతోనే బీజేపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ 80 స్థానాల్లో గెలిచింది. అందుకే ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేందుకు సిద్ధపడింది. తొలి జాబితాలో 160 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. ఇందులో 111 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా వారిలో దాదాపు 69 మంది ఎమ్మెల్యేలకు మాత్రమే తిరిగి అవకాశం కల్పించింది. మిగిలిన వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించింది. మంత్రులను కూడా టిక్కెట్ ఇవ్వకుండా పక్కన పెట్టింది. సర్వేల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

ఆప్ రక్షిస్తుందా?
ఈసారి త్రిముఖ పోటీ ఉంటుందని భావిస్తుండటంతో గెలుపుపై బీజేపీ నమ్మకం పెట్టుకుంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చుకుంటే తమ గెలుపు సులువవుతుందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తుంది. నరేంద్రమోదీ పట్ల ప్రజాదరణ చెక్కు చెదరలేదని, గుజరాత్ లో తిరిగి తమదే అధికారం అన్న భావనలో ఉంది. అందుకే బీజేపీ అధికారంలోకి వస్తే భూపేంద్ర పటేల్ తిరిగి ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారని అమిత్ షా పార్టీ సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రకటించారు. పటేల్ వర్గాన్ని ఆకట్టుకునేందుకే షా ఈ ప్రకటన చేసి ఉంటారని అనుకోవచ్చు. అయితే గెలుపుపై అంచనాకు రావడం అంత సులువు కాదు. అందుకే కమలం నేతలు గెలుపు కోసం చెమటోడుస్తున్నారు. ప్రధాని, కేంద్రమంత్రులు నిత్యం నియోజకవర్గాల్లో పర్యటిస్తూ తమకు అనుకూలంగా వాతావరణాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News