రోగగ్రస్త వ్యవస్థలో ఓ పల్లవుడి అవస్థ

సోషల్‌ మీడియా పవర్‌ను తెలియజెప్పే కథ ఇది. గుండె జబ్బుతో బాధపడుతున్న తన తండ్రికి ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్‌లో వైద్యం చేయించడానికి... గత రెండున్నర నెలలుగా నానా పాట్లు పడుతున్న ఓ మధ్య తరగతి యువకుడి కథ. తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ట్విటర్‌ను ఆశ్రయించాడు. రెండే రోజుల్లో కేంద్ర ఆర్థికమంత్రిని సైతం కదిలించాడు.;

Update: 2023-12-06 12:28 GMT

హృద్రోగికి చుక్కలు చూపించిన ఢిల్లీ ఎయిమ్స్

సోషల్ మీడియా దెబ్బకు వైద్యుల ఉరుకులు పరుగులు  

సోషల్‌ మీడియా పవర్‌ను తెలియజెప్పే కథ ఇది. గుండె జబ్బుతో బాధపడుతున్న తన తండ్రికి ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్‌లో వైద్యం చేయించడానికి... గత రెండున్నర నెలలుగా నానా పాట్లు పడుతున్న ఓ మధ్య తరగతి యువకుడి వ్యధ. తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ట్విటర్‌ను ఆశ్రయించాడు. మిగతా పని అంతా నెటిజెన్ లే  చూసుకున్నారు. రెండే రోజుల్లో కేంద్ర ఆర్థికమంత్రిని సైతం కదిలి వచ్చారు.   

ఉత్తరప్రదేశ్‌లోని దియోరియా అనే చిన్న పట్టణంలో తన తల్లి దండ్రులు, చెల్లెలితో బతికే ఓ మధ్యతరగతి యువకుడు పల్లవ్‌. తనకున్న చిన్నపాటి ఉద్యోగంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తల్లి మెదడు సంబంధ వ్యాధితో మంచాన పడ్డారు. ఆమె కోలుకునే అవకాశం లేదు. గోరు చుట్టు మీద రోకటి పోటులా.. సెప్టెంబర్‌ 15న పల్లవ్‌ తండ్రి అనిల్‌ గుండెపోటుకు గురయ్యారు. ఆయన గుండె కేవలం 20 శాతం మాత్రమే పని చేస్తోంది. హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్‌ (ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌)కి తీసుకుని వచ్చారు. అతని చెల్లెలు 24 గంటలు లైన్లో నిల్చుంటే గానీ కార్డియాలజిస్ట్‌ అపాయింట్‌మెంట్‌ దొరకలేదు. ఆయన్ని కలిసిన తర్వాత, అనిల్‌కు కొన్ని టెస్ట్‌లు చేయించమన్నారు.

ఆ టెస్ట్‌లు ఎయిమ్స్‌లో చేయించడానికి వారం రోజులు పడుతుంది. అప్పటికీ బయట కొన్ని పరీక్షలు చేశారు. ఎకో వారం తర్వాత చేశారు. మరో 24 గంటలు లైన్లో ఉండి, పల్లవ్‌ డాక్టర్‌ను కలిశారు. అనిల్‌ గుండె చాలా బలహీనంగా ఉందని, కొన్ని మందులు రాసి తర్వాత కలవమన్నారు డాక్టర్‌. ఆ ‘తర్వాత’ ఎప్పుడో ఎవరికీ తెలీదు. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లారు తండ్రీ కొడుకులు. అనిల్‌కు అత్యవసరంగా ఆపరేషన్‌ చేయాలని, ఖర్చు కింద ఓ పెద్ద ‘సంఖ్య’ చెప్పారు ప్రైవేట్‌ డాక్టర్లు. దిమ్మ తిరిగిన పల్లవ్‌ మళ్లీ ఎయిమ్స్‌కే వచ్చాడు. చాలాసేపు క్యూలో నిల్చుంటే తెలిసింది.. డాక్టర్‌ గారు సెలవులో ఉన్నారని. 15 రోజులు వెయిటింగ్‌ తర్వాత, మరో 24 గంటలు క్యూలో నిల్చున్న తర్వాత... డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ దొరికింది. అనిల్‌ను సర్జన్‌కు రిఫర్‌ చేశారు. అదేదో ముందే చేయొచ్చుగా!

ఆ సర్జన్‌ చాలా రోజులు వీళ్లని తిప్పించుకుని, చాలా గంటలు వెయిట్‌ చేయించిన తర్వాత... సర్జరీ అవసరమేనని చెప్పారు. కానీ కేవలం ఓ ఏడాది టైం కావాలంట. 20 శాతం మాత్రమే పని చేస్తున్న గుండెతో ఓ పేషెంట్‌ సర్జరీ చేయించుకోడానికి 13 నెలలు వేచి ఉండాలి. ఎయిమ్స్‌లో ఓ పేదోడికి దొరికిన ‘సేవ’ ఇది. రాత్రి పడుకునే తన తండ్రి... మర్నాడు తెల్లవారుజామున లేస్తాడో, లేవడో తెలియని పరిస్థితిలో పల్లవ్‌ ఉన్నాడు. ఆపరేషన్‌కి ఏడాది వెయిట్‌ చేయాలంటే... ఆ కొడుక్కి ఎంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోండి.

ఆ బాధని ఆయన సోమవారం ఎక్స్‌ (ఒకప్పటి ట్విటర్‌)లో పంచుకున్నాడు. అంతే జనం నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కొందరు యూపీఐ నెంబర్‌ షేర్‌ చేయమన్నారు. మరి కొందరు తమ ఊరికి తీసుకువస్తే వైద్యంచేయిస్తామన్నారు. ఇంకొందరు బిల్లులు పంపిస్తే డబ్బులు పంపిస్తామన్నారు. చివరకు ఎయియ్స్‌ కూడా దిగి వచ్చింది. సిబ్బంది స్వయంగా పల్లవిని సంప్రదించారు. విషయం కేంద్ర ఆరోగ్యమంత్రి మంశుఖ్‌ మాండవియా దృష్టికి వెళ్లింది. ఎయిమ్స్‌ పెద్ద తలకాయలన్నీ రంగంలోకి దిగాయి.

డిసెంబర్‌ 4 నాడు పల్లవ్‌ (అతని ట్విటర్‌ ఐడీ పల్లవ్‌ సింగ్‌) తన ఆవేదనను ట్టిటర్‌లో పంచుకుంటే బుధవారం నాటికి వ్యవస్థ అంతా కదిలింది. పల్లవ్‌ వరకూ హ్యాపీ. రోగగ్రస్తమైన మన ఆరోగ్య వ్యవస్థ గురించే నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎంతోమంది మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి జనం ఏళ్ల తరబడి వెయిట్‌ చేయలేక... ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఆ స్థాయిలేని వాళ్లు మౌనంగా ప్రాణాలు వదులుతున్నారు. ఘనత వహించిన ఎయిమ్స్‌ పరిస్థితే ఇలా ఉంటే ఇక మామూలు ప్రభుత్వ వైద్యశాలలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు. ఒక్కరికైనా న్యాయం జరిగిందని ఆనందపడాలో.. అన్యాయమైపోతున్న లక్షలాది మందిని తలుచుకుని బాధపడాలో అర్థం కాని పరిస్థితిలో మనం ఉన్నాం. ట్విటర్‌కు మాత్రం థ్యాంక్స్‌ చెప్పాలి... ఓ ప్రాణాన్ని నిలబెడుతున్నందుకు.

  

Tags:    

Similar News