దేశంలో కోసం ఏదైనా చేయగలిగే, ఎవరితో అయినా కలిసిపోయే వెసులుబాటు దేశంలో కేవలం చంద్రబాబు నాయుడుకే ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు కలవడం పట్ల ఆయన ఎద్దేవా చేశారు. శుక్రవారం రాజమండ్రిలో ఉండవల్లి మీడియాతో మాట్లాడుతూ... ఐటీ దాడులు మామూలుగా జరిగేవే అని, సాధారణ ప్రజలకు ఐటీ దాడుల వల్లే ఎటువంటి నష్టం జరగదన్నారు. ఐటీ దాడుల వల్ల వణికిపోయి చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ మరణం తర్వాత చంద్రబాబు ఒక్కసారి కూడా స్వంతంగా ఎన్నికలకు వెళ్లలేదన్నారు. కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికలకు వెళ్లి ఎన్నికలు కాగానే కమ్యూనిస్టులకు బద్ధవ్యతిరేకి అయిన బీజేపీతో కలిసిపోయిన ఘనత కూడా చంద్రబాబుదే అని పేర్కొన్నారు. ఈపాటికే కాంగ్రెస్ నేతలకు మానసికంగా చంద్రబాబుకు అనుకూలంగా మారిపోయి ఉంటారన్నారు. పోలవరం నిర్మాణంలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, నిర్మాణం ఇలాగే కొనసాగితే భవిష్యత్ లో ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు.