ఆనం... ముహూర్తం.. ఖాయం

వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖాయమైంది

Update: 2023-06-10 05:51 GMT

anam ramanarayana reddy, ycp rebel mla, speaker, tammineni sitaram

త్వరలోనే తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఇందుకోసం పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకే ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీలో యాక్టివ్ అయ్యేందుకు రెడీ అయిపోయారు. ఇటీవల చంద్రబాబును హైదరాబాద్‌లో కలిసి చర్చించిన ఆనం నెల్లూరు జిల్లా టీడీపీ నేతలతోనూ సమావేశమవుతున్నారు. ఆనం రామనారాయణ రెడ్డిని ఇటీవల వైసీపీ సస్పెండ్ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిందన్న కారణంతో ఆయనను సస్పెండ్ చేసింది. అయితే ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు దాదాపుగా సిద్ధమయ్యారు. ఆయన ఆత్మకూరు నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు.

వైసీపీలో గెలిచినా...
2019 ఎన్నికలకు ముందు ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీలోనే ఉన్నారు, రాష్ట్ర విభజన అనంతరం ఆయన టీడీపీలో చేరి ఆత్మకూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే గత ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరడంతో ఆనంను ఆత్మకూరు కాకుండా వెంకటగిరి నియోజకవర్గం టిక్కెట్‌‌ను వైసీపీ నాయకత్వం కేటాయించింది. అక్కడ నెగ్గిన ఆనం రామనారాయణ రెడ్డి తనకు మంత్రి పదవి దక్కలేదని బహిరంగంగానే ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారన్న కారణంతో ఆయన పార్టీ నుంచి వైసీపీ హైకమాండ్ బహిష్కరించింది.
యువగళం...
దీంతో వైసీపీతో ఆనం రామనారాయణ రెడ్డికి ఇప్పుడు ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఫ్రీ గా ఉన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీకి సరైన నేత లేకపోవడంతో ఆనంకు అక్కడే టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఆయన టీడీపీలో చేరతారన్న టాక్ ఉంది. అయితే త్వరలో లోకేష్ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాకు రానున్న నేపథ్యంలో ఆనం రామనారాయణ రెడ్డి యాక్టివ్ అవ్వాని నిర్ణయించుకున్నారు. దాదాపుగా ఆనంకు ఆత్మకూరు నియోజకవర్గం టిక్కెట్ ఖరారయినట్లేనని పార్టీ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి.
ఈ నెల 14న...
అయితే ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి లోకేష్ పాదయాత్రలో పార్టీలో చేరతారా? లేక చంద్రబాబు సమక్షంలో చేరి పాదయాత్రలో పాల్గొంటారా? అన్నది మాత్రం నిర్ణయం కాలేదు. రేపు నెల్లూరు, ఆత్మకూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో తన అనుచరులతో ఆనం సమావేశం కానున్నారు. ఇంకా ఆనంకు ఏడాది ఎమ్మెల్యే పదవి ఉంది. పార్టీ నుంచి సస్పెండ్ చేసినందున సాంకేతికంగా ఇబ్బంది మాత్రం ఏమీ లేకపోవడంతో ఎన్నికలకు తొమ్మిది నెలలు సమయం ఉండటంతో ముందుగానే ఆయన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. ఆనం వివేకానందరెడ్డి కుమారుడు రంగమయూర రెడ్డి ఇప్పటికే లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో సక్సెస్ అయ్యేందుకు కృషి చేస్తున్నారు. దీంతో ఆనం టీడీపీ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని జిల్లా పార్టీలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. బహుశ ఈనెల 14వ తేదీన ఆనం టీడీపీలో అధికారికంగా చేరే అవకాశాలున్నాయి. రేపు దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.


Tags:    

Similar News