నిన్న ఖమ్మంలో జరిగిన ప్రజా కూటమి బహిరంగ సభ, హైదరాబాద్ రోడ్ షో చరిత్రలో నిలుస్తాయని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర నాయకులు చెప్పారు. 37 ఏళ్లుగా పోరాడిన కాంగ్రెస్ తో కలవడం చారిత్రక అవసరం అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే, ఈ సందర్భంగా పలు ఫోటోలు మాత్రం తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
టీడీపీతో కాంగ్రెస్ పొత్తే టీఆర్ఎస్ కి ఒక ఆయుధంగా మారింది. రేపు ప్రజాకూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబుదే మొత్తం పెత్తనమని, ధరఖాస్తులు పట్టుకుని అమరావతికి పోవాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతీ బహిరంగ సభలో చెబుతున్నారు. అయితే, అలా ఏముండదని కాంగ్రెస్, టీడీపీ నేతలు జవాబు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్ రాహుల్ - చంద్రబాబు రోడ్ షో ఫోటో సోషల్ మీడియాతో వైరల్ గా మారింది. ఇందులో రాహుల్, చంద్రబాబు పక్క పక్కన కూర్చోగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి వెనుక నిలబడ్డారు. దీంతో రేపు తెలంగాణ ప్రజాకూటమి అధికారంలోకి వస్తే పెత్తనం ఎవరిదో..? తెలంగాణ వ్యక్తి పరిస్థితి ఏంటో .? ఆలోచించండి అంటూ ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు.