కరువు సీమలో వింత.. బోరుబావిలో నుండి ఉబికివస్తున్న గంగ
తన భూమిలో ఉన్న బోరుబావిలో ఉప్పొంగుతూ వస్తున్న నీటిని చూసి రైతు షాన్‌వాజ్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.
ఆంధ్రప్రదేశ్ లో కరువుకి కేరాఫ్ అడ్రస్.. రాయలసీమ జిల్లాలు. ఏడాది కాలంలో అక్కడ కనీస అవసరాలకు కూడా వర్షపాతం ఉండదు. ఇక వ్యవసాయం సంగతి సరేసరి. అందుకే తక్కువ నీటితో పండే పంటలనే పండిస్తుంటారు రైతులు. అలాంటి కరువుసీమలోని ఓ వ్యవసాయ భూమిలో ఉన్న బోరుబావి నుండి పాతాళగంగ ఉప్పొంగుతోంది. సత్యసాయి జిల్లా ఓడీసీ మండలం గాజుకుంటపల్లిలో కొంతకాలంగా ఇంకిపోయిన బోరు నుంచి ధారాళంగా నీరు రావడంతో రైతులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. నీరు రాకుండా బోరుపై బండరాయి పెట్టినా.. ఆ బండరాయిని సైతం తన్నుకుంటూ గంగ ఉబికి వస్తోంది.
తన భూమిలో ఉన్న బోరుబావిలో ఉప్పొంగుతూ వస్తున్న నీటిని చూసి రైతు షాన్‌వాజ్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. కాగా.. ఎప్పుడూ నీటి కరువుతో ఉండే రాయలసీమలో.. 140 ఏళ్ల రికార్డులు బద్దలు కొడుతూ.. గత నెలలో భారీ వర్షాలు కురిసాయి. ఉమ్మడి కర్నూల్, అనంతపురం జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. వాగులు, వంకలు పొంగి వరదలు వచ్చాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాని వరదలు ముంచెత్తాయి. అతివృష్టి, అనావృష్టిలా తయారైంది సీమ పరిస్థితి. భారీ వర్షాల ధాటికి చిత్రావతి నదిసైతం ఉప్పొంగింది.
గత నెలలో కురిసిన భారీ వర్షాలకు భూగర్భ జలాలు పెరిగినట్లు అధికారులు చెప్పారు. సుమారు నలభై టీఎంసీలకు పైగా నీరు భూమిలో ఇంకినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. అసాధారణ రీతిలో పెరిగిన భూగర్భ జలాల వల్లే బోరుబావి నుండి నీరు ఉబికి వస్తోందని చెబుతున్నారు అధికారులు.