వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై కత్తితో దాడి చేసిన యువకుడు శ్రీనివాస్ తనకు ప్రాణహాని ఉందంటూ పెట్టిన కేకలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తనకు ఎవరి నుంచి ప్రాణహాని ఉందని శ్రీనివాస్ చెప్పకపోయినా....శ్రీనివాస్ మాటల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ పై హత్యాయత్నం చేసిన కేసులో శ్రీనివాస్ ను స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం మూడు రోజుల నుంచి విచారిస్తోంది. ఈరోజు చివరి రోజు కావడంతో శ్రీనివాస్ కు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు విశాఖలోని కేజీహెచ్ కు తీసుకొచ్చింది. అయితే తాను జనం కోసమే చేశానని శ్రీనివాస్ కేకలు పెట్టారు. జనం కోసం చేస్తే జగన్ పై హత్యాయత్నం చేయాలా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందరూ బాగుండాలనే తాను ఈ పనిచేసినట్లు శ్రీనివాస్ చెబుతున్నాడు. తనకు మరణం ఖాయమని శ్రీనివాస్ పదే పదే చెబుతుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
విచారణకు వచ్చిన తర్వాతే అనారోగ్యం.....
కేజీహెచ్ కు తీసుకొచ్చనప్పుడు శ్రీనివాస్ చాలా బలహీనంగా ఉన్నాడు. అయితే పోలీసులు మాత్రం శ్రీనివాస్ మూడు రోజుల నుంచి సరైన ఆహారం తీసుకోవడం లేదని చెబుతున్నారు. శ్రీనివాస్ ను భుజాలపైకి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? మూడు రోజుల క్రితం వరకూ సెంట్రల్ జైలులో శ్రీనివాస్ ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ పోలీసు విచారణకు వచ్చిన తర్వాతనే ఆయన ఆరోగ్యం క్షీణించడం గమనార్హం. పైగా వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి అంటే తనకు ప్రాణమని, జగన్ పై తాను దాడి చేయడానికి ఎవరూ కారణం కాదని, తనను చంపేస్తున్నారని, తనను చంపేసి రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని శ్రీనివాస్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.