వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగితే ముఖ్యమంత్రి వెకిలిగా మాట్లాడటం సరికాదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా రైతు యాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతిపక్ష నేతపై దాడి జరగడం దురదృష్టకరమని, దాడిపై ప్రభుత్వం వెకిలిగా మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. దాడి ఘటనను లోతుగా విచారించి కుట్ర ఉన్నదా అనే విషయం పోలీసులు తేల్చాలన్నారు. తల్లి, చెల్లి కలిసి దాడి చేయించారనడం తప్పని, ఎక్కడైనా తల్లే కొడుకుపై దాడి చేయిస్తుందా..? అని ప్రశ్నించారు. విజయమ్మ, షర్మిల తనను ఎన్నో తిట్టారని, కానీ వారిని తాను ఏమీ అనలేదని గుర్తు చేశారు. లక్ష్మణ రేఖను దాటి టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
ఆయన అధికార దాహానికి నిదర్శనం
రాజకీయ జోక్యం లేకుండా విచరణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఉందని, తన పర్యటనలోనూ పోలీసులు రక్షణ కల్పించకపోవడంతో ఇబ్బంది పడ్డానని పేర్కొన్నారు. కాంగ్రెస్ - టీడీపీ పొత్తు చంద్రబాబు అధికార దాహానికి నిదర్శనమన్నారు. తన అన్న కాంగ్రెస్ లో ఉన్నా రాష్ట్రం కోసం తాను టీడీపీకి మద్దతు ఇస్తే ఇప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ తో కలవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తాను ప్రజాసమస్యలు తెలుసుకోవడానికి యాత్రలు చేస్తున్నానని... అధికారం కోసం కాదని ఆయన స్పష్టం చేశారు.