గూడెం మరణాలపై జగన్ ఏమన్నారంటే?
జంగారెడ్డి గూడెం మరణాలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. అసెంబ్లీలో ఆయన దీనిపై మాట్లాడారు
జంగారెడ్డి గూడెం మరణాలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. అసెంబ్లీలో ఆయన దీనిపై మాట్లాడారు. చంద్రబాబు నీచ రాజకీయాలు చేయడం ఎప్పుడూ మానుకోడని, అలా ఆశించడం మన తప్పిదమే అవుతుందని జగన్ అన్నారు. జంగారెడ్డిగూడెంలో జరిగిన మరణాలు అక్రమ మద్యం వల్ల జరిగినవి కావని ఆయన చెప్పారు. కల్తీ మద్యం తయారు చేసే వారిపై ప్రభుత్వం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏసీబీ అక్రమ మద్యం పై 13 వేల కేసులు నమోదు చేసిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. జరగని విషయాన్ని జరగనట్లుగా టీడీపీ ప్రజల్లో భ్రమ కల్పిస్తుందని జగన్ అన్నారు.
సహజ మరణాలే.....
జంగారెడ్డిగూడెంలో 54,850 మంది నివాసముంటున్నారు. ఇంత పెద్ద మున్సిపాలిటీలో ఇన్ని మరణాలు ఒకే కారణంతో జరుగుతాయా? అని ప్రశ్నించారు. మరణాల సంఖ్య దేశ వ్యాప్తంగా రెండు శాతం ఉంటుంది. అంటే 90 మంది సహజ మరణాలు రోజుకు ఉంటాయని చెప్పారు. సహజమరణాలే అయినా వాటిని వక్రీకరించి అన్యాయమైన రాజకీయాలు చేస్తున్నారని జగన్ అన్నారు. అనారోగ్యం, వివిధ కారణాలతో కొందరు చనిపోతారన్నారు. అక్రమ మద్యం వల్ల మరణించారని అనడం విడ్డూరంగా ఉందన్నారు.
బాబు హయాంలోనే....
చంద్రబాబు హయాంలోనే అక్రమ మద్యం ఉండేదన్నారు. ఇప్పుడు తాను పూర్తిగా లేదని అనలేనని, అయితే అక్కడక్కడా ఉండి ఉంటుందని చెప్పారు. అధికారంలోకి రాగానే 43 వేల బెల్ట్ షాపులను రద్దు చేశామని జగన్ చెప్పారు. మద్యం రేట్లను పెంచడం వల్ల వాడకం తగ్గిందని చెప్పారు. అయితే దీనివల్ల నాటుసారా, అక్రమ మద్యం ఎక్కువవుతుందని చెప్పడం వల్ల తిరిగి తగ్గించాల్సి వచ్చిందని జగన్ చెప్పారు.