Chandrababu : ఎవరినీ వదిలిపెట్టను.. వడ్డీతో సహా చెల్లిస్తా
చింతలపూడి సభలో వైఎస్ జగన్ పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు;
చింతలపూడి సభలో వైఎస్ జగన్ పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ అఖండ సినిమా డైలాగ్ తో ఆయన పార్టీ శ్రేణులను ఉత్సాహపర్చారు. నిరుద్యోగులను జగన్ నిలువునా మోసం చేశారన్నారు. ఉద్యోగాలను భర్తీ చేయకుండా యువతను గత నాలుగున్నరేళ్లుగా పస్తులు ఉంచారన్నారు. టీడీపీ, జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత దశలవారీగా ఇరవై లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలను తెచ్చి యువతకు ఇక్కడే ఉపాధి కల్పించే బాధ్యతను తాను తీసుకుంటామని చంద్రబాబు నాయుడు తెలిపారు.
మద్యం బ్రాండ్లతో...
ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ, పిచ్చి పిచ్చి మద్యం బ్రాండ్లు తెచ్చి యువకులను మద్యానికి బానిసలుగా మార్చారన్నారు. రైతులను తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాలుగా ఆదుకుంటానని తెలిపారు. ప్రతి ఇంట్లో ఎంతమంది చదువుకుంటున్నా ప్రతి ఒక్కరికీ ఏడాదికి పదిహేను వేల రూపాయలు చొప్పున తల్లికి వందనం కింద నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. పింఛన్లు కూడా ఇంటికే తీసుకు వచ్చి లబ్దిదారులకు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని చెప్పిన చంద్రబాబు సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులను కూడా పరుగులు పెట్టించడమే తెలుగుదేశం, జనసేన ముఖ్య ఉద్దేశ్యమని ఆయన వివరించారు.
రాష్ట్రాన్ని అప్పల ఊబిలో...
ీఈసారి జగన్ కు ఓటేస్తే ఇక రాష్ట్రం కోలుకోలేదని తెలిపారు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రంలో అభివృద్ధి జరగదని అన్నారు. పిల్లల భవిష్యత్ అంధకారంలోకి నెట్టేసినట్లేనని అన్నారు. జగన్ పెద్ద సైకో అన్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు. అధికారులను కూడా ఆయన హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వానికి సహకరించిన వారిని వదిలిపెట్టబోమన్న చంద్రబాబు పోలీసులు తమ డ్యూటీని తాము కరెక్ట్ గా చేయాలన్నారు. ప్రభుత్వ ఒత్తిడికి లొంగితే భవిష‌్యత్ లో ఇబ్బంది పడాల్సి ఉంటుందని హెచ్చరించారు.