ఏపీ సర్కార్ కి హైకోర్టు షాక్.. సినిమా టికెట్ల ధరలపై జీవో సస్పెండ్
ఏపీ సర్కార్ కి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సినిమా టిక్కెట్ల ధరలను తగ్గిస్తూ జారీ చేసిన జీవోను సస్పెండ్ చేసింది;
ఏపీకి మరోసారి హైకోర్టులో చుక్కెదురయింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ఒక జీవోను జారీ చేసిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల ధరలను తగ్గించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ థియేటర్ల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్ వేశాయి. నేడు ఈ పిటిషన్ విచారణకు రాగా.. థియేటర్ల యాజమాన్యాల తరపు న్యాయవాదులు ఆదినారాయణ రావు, దుర్గప్రసాద్ తమ వాదనలు వినిపించారు.
టిక్కెట్లను తగ్గిస్తూ....
ప్రభుత్వ తరపు న్యాయవాదులు సైతం.. ప్రభుత్వం ఇచ్చిన జీఓ పై హైకోర్టుకు వివరణ ఇచ్చారు. ఇరు పక్షాల వాదనలను పరిశీలించిన న్యాయస్థానం.. సినిమా టికెట్ల రేట్లను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీఓను సస్పెండ్ చేసింది. సినిమా విడుదల సమయంలో టికెట్ల రేట్లను పెంచుకునే హక్కు థియేటర్ల యాజమాన్యాలకు ఉంటుందని, వాటి ధరలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని వాదించిన పిటిషనర్ తరపు న్యాయవాదుల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. దీంతో థియేటర్ల యాజమాన్యాలకు కాస్త ఊరట లభించింది.