క్యూ కడుతున్న పెట్టుబడులు.. ఏపీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు క్యూ కడుతూ ఉన్నాయి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు క్యూ కడుతూ ఉన్నాయి. రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి సీఎం జగన్ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. దీంతో రిలయన్స్, బిర్లా, టాటా లాంటి పారిశ్రామిక దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. గతేడాది మార్చిలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో కుదిరిన ఒప్పందాలు వాస్తవ రూపంలోకి వస్తున్నాయి. రాష్ట్రంలో రూ.4,178 కోట్లతో ఆదిత్య బిర్లా గ్రూప్, రిలయెన్స్ ఎనర్జీ, హెల్లా ఇన్‌ఫ్రా, వెసువియస్ ఇండియా లిమిటెడ్, ఏపీఐఐసీ, ఏపీ ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్‌కు సంబంధించిన మొత్తం 8 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇటీవలే జరిగాయి.
సాధారణంగా దేశంలో పెట్టుబడుల సదస్సులోజరిగే ఒప్పందాల్లో 16 నుంచి 17 శాతం మాత్రమే వాస్తవ రూపంలోకి వస్తాయని, మన రాష్ట్రంలో మాత్రం సదస్సు జరిగి ఏడాది కాకుండానే 19 శాతం పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రావడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. జీఐఎస్‌లో మొత్తం రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు జరగ్గా రూ.2.46 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన పనులు వేర్వేరు దశల్లో ఉన్నాయి.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక సుమారు రూ.20 వేల కోట్లతో నాలుగు ప్రధాన పోర్టులను నిర్మిస్తున్నారు. ఇక రామాయపట్నం పోర్టు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. మరో రూ.నాలుగు వేల కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక యువత ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత నాలుగేళ్లలో 2.50 లక్షల ఎంఎస్‌ఎంఈ యూనిట్ల ఏర్పాటు ద్వారా ఆరు లక్షల మందికి పైగా ఉపాధి కల్పించారు. యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలను విస్తృతం చేసేందుకు 50కిపైగా పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటుకు కృషి జరుగుతోంది. ఏపీ ప్రభుత్వం కృష్ణపట్నంను పారిశ్రామిక నోడ్‌గా తీర్చిదిద్దుతోంది. తిరుపతి జిల్లాలో క్రిస్ సిటీ ఏర్పాటుకు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. దీనిద్వారా రూ.5 వేల కోట్ల పెట్టుబడులు, 14 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఓర్వకల్లు వద్ద పారిశ్రామిక నగరాన్ని అభివృద్ధి చేస్తోంది.