Pawan Kalyan : పవనూ...ప్రశ్నించడం ఆగిందా? ప్రశంసించడానికే పరిమితమయిందా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందు ఎంత దూకుడుగా ఉండేవారో ఇప్పుడు మౌనంగా ఉన్నారు. ప్రశ్నించడం మానేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందు ఎంత దూకుడుగా ఉండేవారో ఇప్పుడు సాధుజీవిగా మారారు. అసలు మాట్లాడటమే మానేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ప్రశ్నించలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఎవరికైనా బయట ఉండి చూస్తే అంతా బాగానే కనిపిస్తుంది. అలాగే లోపలికి వచ్చి చూస్తే కాని అసలు విషయం తెలియదంటారు. అదే పవన్ కల్యాణ్ విషయంలో నిజమయిందంటున్నారు. అధికారంలో లేనపుడు పదే పదే ప్రశ్నించిన పవన్ కల్యాణ్.. అధికారంలోకి రాగానే ఇప్పుడు అసలు విషయం అర్థమయినట్లుంది. అసలు పాలన ఎంత కష్టమో ఆయనకు బోధపడినట్లుంది.
ఎన్నికలకు ముందు...
విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే తమ కూటమి వల్లే సాధ్యమవుతుందని ఎన్నికలకు ముందు పదే పదే పవన్ కల్యాణ్ చెప్పారు. తమ కూటమి ఇచ్చిన హామీలకు తాను భరోసా ఇస్తున్నానని, తాను దగ్గరుండి వాటిని అమలు చేయిస్తానని పదే పదే బహిరంగ సభల్లో చెప్పుకొచ్చారు జనసేనాని. సూపర్ సిక్స్ గాని, ఎన్నికలకు ముందు విడుదల చేసిన టీడీపీ, జనసేన మ్యానిఫేస్టోలో అంశాల విషయంలో కానీ ఆయన తనది గ్యారంటీ అని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన తర్వాతనే తన పని తాను చూసుకుంటానని, తనను నమ్మాలంటూ ఆయన ప్రజలను పలు బహిరంగ సభల్లో కోరడం కూడా వినిపించింది. కనిపించింది.
అధికారంలోకి రాగానే...
అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత తత్వం బోధపడినట్లుంది. అధికారంలో ఉండి మనమేం చేయలేమన్న భావనకు పవన్ కల్యాణ్ వచ్చినట్లు కనపడుతుంది. ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల బాధ్యతలను పవన్ కల్యాణ్ చేపట్టారు. ఆయన ఆ శాఖలను అధ్యయనం చేస్తున్నారు. లోతుగా అన్ని విషయాలను పరిశీలిస్తున్నారు. అంత వరకూ ఓకే. ఆయన శాఖకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని ప్రజల నుంచి ప్రశంసలు కూడా పొందారు. ప్రధానంగా పంచాయతీలకు నిధులు కేటాయించి ఆయన సర్పంచ్ ల నుంచి మంచి మార్కులు కొట్టేశారు.
పవన్ ను నమ్మి...
కానీ పవన్ కల్యాణ్ ను నమ్మి యువత, కాపు సామాజికవర్గంతో పాటు ఆయన అభిమానులందరూ కూటమికి ఓటు వేశారు. ముఖ్యంగా మహిళలు కూడా పవన్ కల్యాణ్ వైపు మొన్నటి ఎన్నికల్లో మొగ్గు చూపారు. అయితే వీళ్లందరికీ ఇచ్చిన హామీల అమలుకు మాత్రం పవన్ కల్యాణ్ ఏమాత్రం దృష్టిపెట్టడం లేదు. కనీసం ప్రశ్నించడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని ప్రశ్నించలేక పోవచ్చు. కనీసం పవన్ కల్యాణ్ జోక్యం చేసుకుని ఇచ్చిన హామీల అమలు ఏ తేదీ నుంచి చేస్తారో అని చెప్పగలిగితే పవన్ కల్యాణ్ పై నమ్మకం ఉంటుంది. ఇంకా గౌరవం పెరుగుతుంది. కానీ పవన్ కల్యాణ్ అది వదిలేసి ఇప్పటికీ టీడీపీ నిర్ణయాలను ప్రశంసిస్తూ, ఓటమి పాలయిన వైసీపీని విమర్శిస్తుంటే ఆయన కూడా రాజకీయ నాయకుడు కాక.. నయా లీడర్ ఎలా అవుతాడని సోషల్ మీడియాలో పోస్టింగ్ లు కనపడుతున్నాయి. మరి దీనికి పవన్ ఒక్కరే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.