యువతరం కోసమే తన ఆలోచన అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర తనకు ఓనమాలు నేర్పిందన్నారు. ఈ ప్రాంతం అందరినీ అక్కున చేర్చుకుందన్నారు. తాను ఇక్కడకు ఓటమి పాలయినా భయపడేది లేదన్నారు. బాధపడేది ఉండదన్నారు. ఇక్కడి వారు వలసలు పోతున్నారని, అవి ఆగాలంటే కొత్త ప్రభుత్వం రావాలని పవన్ కల్యాణ్ కోరారు. అధికారం కోసం తాను ఓట్లు అడగనని, మార్పు కోసమే తాను ఓట్లు అడుగుతున్నానని ఆయన చెప్పారు. గాజువాకలో ఓడిపోతే తాను పెద్దగా ఫీల్ కాలేదన్నారు. కానీ విశాఖ వచ్చిన రోజు రెండు లక్షల మంది వచ్చారని, ఆ ప్రేమ తనకు కన్నీళ్లు తెప్పించిందన్నారు. తాను జనసేనను ఏ పార్టీలో కలపను, బతికినా, మరణించినా పార్టీ ఎక్కడకూ వెళ్లదన్నారు. అభిమానం, ప్రేమ ఓట్ల రూపంలో బదిలీ కాకుంటే మీరిచ్చే నినాదాలు సాధ్యం కాదన్నారు. ముఖ్యమంత్రి ఎవరన్నది తాను, చంద్రబాబు కలసి కూర్చుని నిర్ణయించుకుంటామని చెప్పారు. తాను తెలుగుదేశం పార్టీ వెనక నడవటం లేదని, కలసి నడుస్తున్నామని చెప్పారు.
డబ్బులు లేకుండా...
డబ్బులు లేకుండా పార్టీని నడుపుతున్నానని చెప్పారు. అది మీ అందరి ప్రేమ అభిమానం వల్లనే సాధ్యమయిందన్నారు. పొగిడితే కొందరు ఉప్పొంగి పోతారని, కానీ తాను మాత్రం ప్రతి కష్టానికి ఉప్పొంగి పోతానని చెప్పారు. 151 సీట్లు వైసీపీకి ఇస్తే కనీసం జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఈ తరాన్ని కాపాడుతూ రాబోయే తరాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని భావించి తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. సినిమాల్లోనే తాను ఉండి ఉంటే తనకు ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కావని, కానీ ప్రజల కోసం మాత్రమే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. 2014లో తాను టీడీపీ, బీజేపీకి అండగా ఉంది కూడా విడిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నదేనని అన్నారు. కానీ 2019లో మాత్రం అది కుదరలేదు. 2024లో మాత్రం ఏపీ భవిష్యత్ బంగారుమయం చేయాలన్నారు.
ఎన్నికల గురించి..
ఎన్నికల గురించి తాను ఎప్పుడూ ఆలోచించనని ఆయన అన్నారు. తాను బీజేపీలో చేరితే కోరకున్న పదవి లభిస్తుందన్నారు. కానీ విభజన జరిగి పదేళ్లవుతున్నా ఏపీకి రాజధానికి దారేది అంటే చెప్పలేకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. మీ భవిష్యత్ కోసం తాను అందరి చేత తిట్లు తింటున్నానని అన్నారు. విజయానికి దగ్గర దారులు లేవని పవన్ అన్నారు. తనకు నినాదాలు కొత్త కాదని, చపట్లు కొత్తేమీ కాదని.. అందరూ ఓటేయాలని ఆయన కోరారు. రాజకీయాలు కలుషితమయ్యాయని యువత ముందుకు రావడం లేదన్నారు. మీకు పాతికేళ్లు భవిష్యత్ ఇస్తే తనకు అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదన్నారు. స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించవద్దని తాను అమిత్ షాతో చెప్పిన తర్వాతనే అది ఆగిందన్నారు. తాము అధికారంలోకి వస్తే పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ఒక్కసారి జనసేన, టీడీపీ కూటమిని గెలిపించాలని కోరారు