Ys jagan : జగన్ రాజీ పడతారా? నో... నెవ్వర్ అంటున్న క్యాడర్

వైసీపీ అధినేత జగన్ తన సోదరితో రాజీపడినట్లు వస్తున్న వార్తలను సోషల్ మీడియాలో ఆ పార్టీ క్యాడర్ తీవ్రంగా ఖండిస్తుంది.

Update: 2024-10-23 04:14 GMT

వైసీపీ అధినేత జగన్ తన సోదరితో రాజీపడినట్లు వస్తున్న వార్తలను సోషల్ మీడియాలో ఆ పార్టీ క్యాడర్ తీవ్రంగా ఖండిస్తుంది. జగన్ ది రాజీపడని మనస్తత్వం అని వారు కామెంట్స్ పోస్టు చేస్తున్నారు. జగన్ ఒకసారి వదిలేస్తే ఇక పార్టీలో కూడా చేర్చుకునే మనస్తత్వం కాదన్నది నేతల నుంచి వస్తున్న అభిప్రాయం కూడా. అలాంటి తన సోదరి వైఎస్ షర్మిలతో రాజీ పడి ఇద్దరూ ఒక్కటవుతారని ఎందుకు అనుకుంటున్నారంటూ వారు పోస్టులు పెడుతున్నారు. జగనన్నను డ్యామేజీ చేయడానికే ఒక వర్గం మీడియా చేస్తున్న పని అంటూ కొందరు పనిగట్టుకుని మరీ ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ వచ్చిన వార్తలను, జగన్ కానీ, అటు వైఎస్ షర్మిల కానీ ఖండించకపోవడంతో కొంత నమ్మాల్సి వస్తుందని మరికొందరు నేతలు చెబుతున్నారు.

2019 నాటి నుంచి...
వైఎస్ జగన్, వైఎస్ షర్మిల ఇద్దరూ అన్నా చెల్లెళ్లు అయినా అంతకు మించి అనుబంధం ఉన్నవాళ్లు. కానీ అది ఒకప్పుడు. అయితే అదీ 2019 ఎన్నికల నాటికే. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇద్దరి మధ్య పొరపొచ్చాలు తలెత్తాయి. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీని పెట్టినా జగన్ సహకరించలేదు. నాటి వైసీపీ నేతలను ఒక్కరినీ కూడా ఆ పార్టీలో చేరనివ్వకుండా అడ్డుపడ్డారు. అదే సమయంలో తన సోదరుడు జగన్ పై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీతో వైఎస్ షర్మిల చేతులు కలిపారు. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అంతవరకూ అందరికీ తెలిసిందే. ఆస్తి తగాదాలంటారు. కొందరు వ్యక్తిగత మైన విరోధమంటారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ షర్మిల డిమాండ్లకు తలొగ్గలేదని ఇద్దరి మధ్య దూరం పెరిగిందనే వారు కూడా లేకపోలేదు.
మొన్నటి ఎన్నికల్లో...
ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్ కు 2024 ఎన్నికల్లో వైఎస్ షర్మిల అడ్డం తిరిగారు. బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలోనూ జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. పీసీసీ చీఫ్ కావడంతో ఊరూరా తిరుగుతూ జగన్ పై వ్యతిరేక ప్రచారం చేశారు. చివరకు కడప పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీచేసిన వైఎస్ షర్మిల ఓటమి పాలయ్యారు. అంత వరకూ ఓకే. పీసీసీ చీఫ్ గా ఆమె చేసిన విమర్శలు కావచ్చు. జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కావచ్చు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓటమి పాలయింది. అయితే జగన్ పార్టీ ఓటమి పాలయిన తర్వాత కూడా వైఎస్ షర్మిల విమర్శలలో పదును తగ్గలేదు. జగన్ ను అన్ని విషయాల్లో సమయానుకూలంగా ఎండకడుతూనే ఉన్నారు.
తల్లిని చూసేందుకు కూడా...
ఓటమి తర్వాత హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు కూడా జగన్ అడుగు పెట్టలేదు. అంతే కాదు అక్కడ ఉన్న తన తల్లి విజయమ్మను కూడా చూసేందుకు వెళ్లలేదు. వైఎస్ జయంతి, వర్థంతి నాడు ఇడుపులపాయలో కలవడం తప్పించి ప్రత్యేకించి విజయమ్మతో భేటీ అయింది కూడా లేదు. ఆయన బెంగళూరుకు వెళుతున్నారు. అలాంటి వైఎస్ జగన్ తన సోదరి వైఎస్ షర్మిలతో రాజీ పడతారంటే ఎవరు నమ్ముతారంటూ సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు, జగన్ ఫ్యాన్స్ పోస్టింగ్ లు పెడుతుండటం విశేషం. అందులో నిజం కూడా లేకపోలేదు. జగన్ ఎవరి మాట వినరు. ఒకసారి వదిలించుకుంటే ఇక వారి మొహం చూసేందుకు కూడా ఇష్టపడరు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న జగన్ రాజీ పడతారంటే తాము నమ్మలేమంటున్నారు. అధికారిక ప్రకటన వస్తే తప్ప తాము నమ్మబోమని చెబుతున్నారు. మొత్తం మీద అన్నా చెల్లెళ్ల రాజీ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి.


Tags:    

Similar News