నేడు ఏపీలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు
కృష్ణ, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ప్రకాశం, విశాఖ జిల్లాలోనూ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగానే నమోదయ్యాయి.
ఏపీ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గాలంటే మరో రెండు రోజులు ఓపిక పట్టాలని వాతావరణశాఖ తెలిపింది. అమ్మో ఇంకా రెండు రోజులా అని భయపడుతున్నారు ఏపీవాసులు. శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. కృష్ణ, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ప్రకాశం, విశాఖ జిల్లాలోనూ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగానే నమోదయ్యాయి. ఇక శనివారం అయితే ఉదయం 6 గంటల నుంచే వడగాల్పులు మొదలయ్యాయి. మొత్తం 478 మండలాల్లో వడగాల్పులు వీచాయి. వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ శనివారం తెలిపారు.
జూన్ 18 ఆదివారం 109 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 206 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వివరించారు. అల్లూరి 9, అనకాపల్లి 6, బాపట్ల 8, తూర్పుగోదావరి 17, ఏలూరు12, గుంటూరు 9, కాకినాడ 18, కోనసీమ 7, కృష్ణా 15, మన్యం 5, పశ్చిమగోదావరలో 3 మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అలాగే సోమవారం (జూన్19) 73 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 227 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
శనివారం రాష్ట్రంలోని విజయనగరం జిల్లా కనిమెరకలో అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మన్యం జిల్లా పాచిపెంటలో 44.9°C, ఏలూరు జిల్లా కామవరపుకోటలో 44.7°C, నెల్లూరు జిల్లా కొండాపురంలో 44.5°C, అల్లూరి జిల్లా ఎర్రంపేటలో 44.3°C, తూర్పుగోదావరి జిల్లా చిట్యాల, కృష్ణా జిల్లా నందివాడ, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో 44.1°C, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 44°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. 188 మండలాల్లో తీవ్రవడగాల్పులు,176 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.