ఏపీలో విస్తరిస్తున్న నైరుతి.. తెలంగాణకు వర్షసూచన
నిన్నటికి రుతుపవనాల్లో కదలికలు వచ్చి.. రాయలసీమంతటా వ్యాపించాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో రెండు, మూడు..
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మండుటెండలకు కాస్త ఉపశమనం లభిస్తోంది. శ్రీహరికోట వద్ద రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. బిపోర్ జోయ్ తుపాను కారణంగా కదలికలు లేకుండా అక్కడే ఆగిపోయాయి. నిన్నటికి రుతుపవనాల్లో కదలికలు వచ్చి.. రాయలసీమంతటా వ్యాపించాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో రెండు, మూడు రోజుల్లో రాష్ట్రమంతటా నైరుతి వ్యాపిస్తుందని, ప్రజలకు మండుటెండల నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు. నైరుతి కోసం రైతన్నలు కూడా ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. వాతావరణ శాఖ ఈ గుడ్ న్యూస్ చెప్పింది.
దిగువ స్థాయిలోని గాలులు వాయువ్యం నుంచి తెలంగాణ వైపుకి వీస్తుండటంతో.. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ విభాగం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని పేర్కొంది. మంగళవారం మాత్రం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్,హన్మకొండ, వరంగల్ మరియు జనగాం జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో వడగాల్పులు వీస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.