పరీక్ష హాల్లో అమ్మాయిల్ని చూసి కళ్లుతిరిగి పడిపోయిన విద్యార్థి
దాంతో ఆ స్కూల్ సిబ్బంది వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మనీశ్ కుటుంబీకులు ఆస్పత్రికి..
బీహార్ లో నిన్నటి నుండీ ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలయ్యాయి. ఈ క్రమంలో పరీక్ష రాసేందుకు హాల్ లోకి వెళ్లిన విద్యార్థి.. అక్కడున్న అమ్మాయిల్ని చూసి స్పృహ తప్పి పడిపోయాడు. ఎందుకంటే.. 500 మంది అమ్మాయిల మధ్యలో.. ఆ విద్యార్థిని వేశారు అధికారు. నలందా జిల్లాలో జరిగిన ఈ ఘటన తాలుకా వివరాలిలా ఉన్నాయి. మనీశ్ శంకర్ ప్రసాద్ అనే 17 ఏళ్ల విద్యార్థి అల్లామా ఇక్బాల్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. గణితం పరీక్ష రాసేందుకు నిన్న సుందర్‌గఢ్‌లోని బ్రిలియంట్ కాన్వెంట్ స్కూలుకు వెళ్లాడు. హాల్లోకి వెళ్లగానే లోపల పెద్ద సంఖ్యలో కనిపించిన అమ్మాయిలను చూసి ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడ్డాడు.
దాంతో ఆ స్కూల్ సిబ్బంది వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మనీశ్ కుటుంబీకులు ఆస్పత్రికి చేరుకున్నారు. 500 మంది అమ్మాయిలున్న పరీక్ష హాల్లో తన కొడుకుని ఒక్కడినే వేయడంతో.. కంగారు పడి కళ్లుతిరిగి పడిపోయాడని తండ్రి సచ్చిదానంద ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం అతను కోలుకున్నట్లు పేర్కొన్నారు. కాగా.. పూర్తిగా అమ్మాయిల కోసం కేటాయించిన పరీక్షహాలులో అబ్బాయికి సీటెలా వేస్తారని విద్యార్థి తరపు బంధువులు బీహార్ ఇంటర్మీడియట్ కౌన్సిల్ పై మండిపడుతున్నారు. 500కుపైగా అమ్మాయిలు ఉన్న పరీక్ష హాలులో తన మేనల్లుడికి సీటు కేటాయించడం ముమ్మాటికి అధికారుల తప్పేనని మనీశ్ మేనత్త ఆగ్రహం వ్యక్తం చేశారు.