భారత్ లో కోరలు చాస్తోన్న కరోనా.. 12 రాష్ట్రాల్లో పెరిగిన పాజిటివ్ కేసులు !
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3.02 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా.. 2,541 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది.
న్యూఢిల్లీ : కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. చైనాలో కరోనా తొలినాళ్లలో కంటే.. ఇప్పుడే పరిస్థితి దారుణంగా ఉంది. రోజురోజుకూ అక్కడ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్లు విధించినా.. ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వలేక బయటికి వస్తుండటం అక్కడ కేసులు పెరగడానికి ఒక కారణం. భారత్ లోనూ రోజువారీ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. జూన్ నుంచి ఫోర్త్ వేవ్ మొదలవుతుందని ఇప్పటికే హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో.. కొద్దిరోజులుగా దేశంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజువారీ కేసుల పెరుగుదలతో యాక్టివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. రికవరీల సంఖ్య తగ్గుతోంది.
తాజాగా కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. దాని ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3.02 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా.. 2,541 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఇదే సమయంలో 1862 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. 30 మంది మృతి చెందారు. తాజా మృతులతో కలిపి ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 5,22,223కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 16,522 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 187 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. కాగా.. గడిచిన వారంరోజులుగా దేశంలో నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే.. 12 రాష్ట్రాల్లా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేసుల పెరుగుదలతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.