నిలిచిన అమర్నాథ్ యాత్ర..చిక్కుకున్న తెలుగు యాత్రికులు
శనివారం తెల్లవారుజామున కురిసిన వర్షాలకు రాంబన్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో.. జమ్మూ - శ్రీనగర్ హైవేను మూసివేశారు.
భారీ వర్షాలు అమర్నాథ్ యాత్రకు బ్రేక్ వేశాయి. వరుసగా రెండోరోజు అమర్నాథ్ యాత్ర నిలిచిపోయింది. జమ్ము-శ్రీనగర్ హైవే పై కొండచరియలు విరిగిపడటంతో.. పహల్గాం, బల్తాల్ మార్గాల్లో యాత్రను నిలిపివేశారు. దాంతో యాత్రకు వెళ్లిన వేదాలి భక్తులు బల్తాల్, నున్వాన్ బేస్, భగవతి నగర్ బేస్ క్యాంపుల్లోనే ఉండిపోవాల్సి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో యాత్రకు వెళ్లిన 1500 మంది యాత్రికులు పంచతర్ణి ప్రాంతంలో చిక్కుకుపోయారు. వీరిలో సుమారు 200 మంది తెలుగు యాత్రికులున్నట్లు సమాచారం. భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లోకి పడిపోవడంతో.. యాత్రికులు ఆందోళన చెందుతున్నారు.
శనివారం తెల్లవారుజామున కురిసిన వర్షాలకు రాంబన్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో.. జమ్మూ - శ్రీనగర్ హైవేను మూసివేశారు. దాంతో అమర్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పటికే యాత్ర మధ్యలో ఉన్నవారిని బేస్ క్యాంపుల్లోనే ఉంచినట్లు అధికారులు తెలిపారు. వారికి మంచినీరు, ఆహారం అందిస్తున్నట్లు వెల్లడించారు. తిరిగి అమర్నాథ్ యాత్ర ప్రారంభమయ్యేందుకు కనీసం రెండురోజులైనా పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. యాత్రలో మధ్యలో ఆగిపోవడం, భారీవర్షాలు, ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో యాత్రికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. యాత్రికులు ప్రస్తుతానికి సురక్షితంగానే ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకూ అమర్నాథుడిని 82 వేలమంది యాత్రికులు దర్శించుకున్నారు. ఆగస్టు 31 వరకూ యాత్ర కొనసాగనుంది.